భారత్‌కు ఎనిమిది పతకాలు

23 Mar, 2017 00:38 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫజా అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ప్రి మీట్‌లో భారత క్రీడాకారులకు ఎనిమిది పతకాలు లభించాయి. ఇందులో మూడు స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ జావెలిన్‌ త్రో, డిస్కస్‌ త్రో విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచాడు. ఎఫ్‌–46 విభాగంలో పోటీపడ్డ సుందర్‌ జావెలిన్‌ను 60.33 మీటర్లు, డిస్క్‌ను 44.56 మీటర్లు దూరం విసిరి విజేతగా నిలిచాడు.

జావెలిన్‌ త్రో ఎఫ్‌–44 విభాగంలో నరేంద్ర రణబీర్‌  (47.75 మీటర్లు) భారత్‌కు మూడో స్వర్ణాన్ని అందించాడు. పురుషుల 400 మీటర్ల టి–42/44/46 విభాగంలో ఆనందన్‌ గుణశేఖరన్‌ రజతాన్ని గెలుపొందగా... ప్రమోద్‌ కుమార్‌ యాదవ్‌ కాంస్యాన్ని సాధించాడు. రామ్‌కరణ్‌ సింగ్‌ 800 మీటర్ల టి–13/20 విభాగంలో, రోహిత్‌ 400 మీటర్ల టి–11/12/13 విభాగంలో, పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌– 40/41/42 విభాగంలో సుర్జిత్‌ సింగ్‌ కాంస్య పతకాలు సాధించారు. 48 దేశాలు పోటీ పడుతున్న ఈ మీట్‌లో ప్రస్తుతం భారత్‌ ఎనిమిది పతకాలతో ఏడో స్థానంలో ఉంది.

మరిన్ని వార్తలు