కోహ్లి సెంచరీ.. ధోని ఫినిషింగ్‌ టచ్‌

15 Jan, 2019 17:14 IST|Sakshi

6 వికెట్ల తేడాతో భారత్‌ ఘనవిజయం

హాఫ్‌ సెంచరీతో అదరగొట్టిన ధోని

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కోహ్లి

అడిలైడ్‌ : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో చెలరేగడంతో భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠకరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోని ఫినిషింగ్‌ టచ్‌తో విజయం భారత్‌నే వరించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. షాన్‌ మార్ష్‌ (131; 123 బంతులు,11ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత సెంచరీ, మాక్స్‌వెల్‌(48)లు చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వికెట్‌ ఏమీ తీయకపోగా దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ 4 వికెట్లు తీయగా.. మహ్మద్‌ షమీ మూడు, జడేజా ఒక వికెట్‌ తీశారు. అనంతరం 299 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (32), రోహిత్‌ శర్మ(43) మంచి శుభారంభం అందించారు.

కోహ్లి సెంచరీ..
అనవసర షాట్‌కు యత్నించి ధావన్‌ పెవిలియన్‌ చేరగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి.. రోహిత్‌తో కలిసి ఆచితూచి ఆడాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అనంతరం రోహిత్‌ క్యాచ్‌ఔట్‌గా వెనుదిరగగా.. క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడుతో కోహ్లి బాధ్యాతాయుతంగా ఆడాడు. రాయుడు (24;36 బంతుల్లో).. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో మూడో వికెట్‌కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనితో కోహ్లి దాటిగా ఆడాడు. ఈ క్రమంలో 105 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్స్‌లతో కెరీర్‌లో 39వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ సెంచరీ అడిలైడ్‌లో కోహ్లికి ఓవరాల్‌ 5వది కాగా.. వన్డేల్లో రెండవది కావడం విశేషం. ఇదే అడిలైడ్‌ వేదికగా కోహ్లి టెస్ట్‌ల్లో మూడు సెంచరీలు సాధించాడు. ఇక రిచర్డ్సన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన కోహ్లి (104; 112 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బౌండరీ లైన్‌ వద్ద మ్యాక్స్‌వెల్‌ క్యాచ్‌ పట్టడంతో నాలుగో వికెట్‌కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ధోని ఫినిషింగ్‌ టచ్‌..
శతకంతో కోహ్లి.. మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పగా.. దినేష్‌ కార్తీక్‌(25 నాటౌట్‌)తో కలిసి ధోని(55 నాటౌట్‌) ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. ఈ జోడి వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. చేధించాల్సిన రన్‌రేట్‌ తగ్గకుండా జాగ్రత్తగా ఆడింది. చివరి ఓవర్లో భారత విజయానికి 7 పరుగులు కావాల్సి ఉండగా.. తొలి బంతిని ధోని అద్భుతంగా సిక్స్‌ బాదాడు. ఈ సిక్స్‌తో ధోని కెరీర్‌లో 69వ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఇది అతనికి ఈ సిరీస్‌లో వరుసగా రెండవ అర్థశతకం కావడం విశేషం. 54 బంతుల్లో 55 పరుగులు చేసిన ధోని ఒక్క ఫోర్‌ లేకుండా.. రెండు సిక్స్‌లు బాదటం ఇక్కడ మరో విశేషం. మరుసటి బంతిని ధోని సింగిల్‌ తీయడంతో భారత్‌.. నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. ఆసీస్ బౌలర్లలో బెహ్రెన్‌డార్ఫ్‌, రిచర్డ్సన్‌, స్టోయినిస్‌, మ్యాక్స్‌వెలు తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ 1-1తో సమమైంది. సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌ శుక్రవారం మెల్‌బోర్న్‌ వేదికగా జరగనుంది.

మరిన్ని వార్తలు