మూడోసారి ఆసియా కప్‌ భారత్‌ సొంతం

22 Oct, 2017 20:02 IST|Sakshi

ఢాకా : ఆసియా కప్‌ హాకీ-2017 టైటిల్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. ఆదివారం ఢాకా వేదికగా మలేసియాతో తలపడిన భారత్ హాకి జట్టు 2-1 గోల్స్‌ తేడాతో విజయ భేరి మోగించింది. టోర్నీలో గ్రూప్‌ దశ నుంచి భారత్‌ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఫస్ట్‌ హాఫ్‌ మూడో నిమిషంలో రమణ్‌ దీప్‌ సింగ్‌ గోల్‌ చేయడంతో భారత్‌ ఖాతా తెరిచింది.

అనంతరం 29వ నిమిషంలో లలిత్‌ ఉపాధ్యాయ్‌ మరో గోల్‌ను భారత్‌కు అందించారు. మైదానంలో మెరుపులా కదులుతున్న భారత ఆటగాళ్ల నుంచి బంతిని లాక్కునేందుకు మలేసియా స్ట్రైకర్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మలేసియా ఆటగాడు సహ్రిల్‌ సాబా 50వ నిమిషంలో ఆ జట్టుకు తొలి గోల్‌ అందించాడు.

మిగిలిన సమయంలో మలేసియా ఆటగాళ్లను గోల్‌ చేయనివ్వకుండా భారత ప్లేయర్లు చేసిన ప్రయత్నాలు సఫలం చెందాయి. దీంతో భారత్‌ మూడో మారు ఆసియా విజేతగా నిలిచింది. లలిత్‌ ఉపాధ్యాయ్‌కు గోల్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కగా, ఆకాశ్‌ దీప్‌ సింగ్‌ను మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

మరిన్ని వార్తలు