అమ్మాయిలు అజేయంగా...

1 Mar, 2020 02:56 IST|Sakshi

మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు వరుసగా నాలుగో విజయం

శ్రీలంకపై ఏడు వికెట్లతో గెలుపు

గ్రూప్‌ ‘ఎ’లో టాపర్‌గా ముగింపు

రాధా యాదవ్‌ మాయాజాలం

షఫాలీ వర్మ మరో మెరుపు ఇన్నింగ్స్‌

మెల్‌బోర్న్‌: టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో తమ విజయయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా నాలుగో విజయం సాధించిన భారత్‌ గ్రూప్‌ ‘ఎ’ టాపర్‌గా తమ లీగ్‌ మ్యాచ్‌లను ముగించింది. శ్రీలంకతో శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండిమా ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 113 పరుగులు చేసింది. భారత్‌ 14.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (34 బంతుల్లో 47; 7 ఫోర్లు, సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. భారత స్పిన్నర్‌ రాధా యాదవ్‌ (4/23)కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో భారత్‌ 8 పాయిం ట్లతో గ్రూప్‌ ‘ఎ’లో అగ్రస్థానం సంపాదించింది.

స్పిన్‌ మ్యాజిక్‌... 
టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు ఉపక్రమించింది. మూడో ఓవర్‌ తొలి బంతికే స్పిన్నర్‌ దీప్తి శర్మ లంక ఓపెనర్‌ థిమాషినిని అవుట్‌ చేసింది. ఆ తర్వాత జయాంగని, హర్షిత కొంచెంసేపు వికెట్లను కాపాడుకున్నారు. అయితే హర్షితను బౌల్డ్‌ చేసి స్పిన్నర్‌ రాజేశ్వరి ఈ జోడిని విడగొట్టింది. అనంతరం మరో స్పిన్నర్‌ రాధా యాదవ్‌ తన మాయాజాలాన్ని ప్రదర్శించింది. శ్రీలంక పతనాన్ని శాసించింది. మరో స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ ఒక వికెట్‌ తీసింది. మొత్తం శ్రీలంక కోల్పోయిన తొమ్మిది వికెట్లలో ఎనిమిది వికెట్లు స్పిన్నర్లకే రావడం విశేషం.

ఆడుతూ... పాడుతూ... 
114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ మరోసారి మెరిసింది. లంక బౌలర్ల భరతం పట్టింది. ఏడు బౌండరీలు కొట్టింది. మరోవైపు స్మృతి (12 బంతుల్లో 17; 3 ఫోర్లు) కూడా తన జోరు కొనసాగించింది. తొలి వికెట్‌కు 34 పరుగులు జోడించాక స్మృతి పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (14 బంతుల్లో 15; 2 ఫోర్లు, సిక్స్‌)తో షఫాలీ రెండో వికెట్‌కు 47 పరుగులు జత చేసింది. హర్మన్‌ప్రీత్, షఫాలీ అవుటయ్యాక... జెమీమా (15 నాటౌట్‌; ఫోర్‌), దీప్తి శర్మ (15 నాటౌట్‌; 2 ఫోర్లు) నాలుగో వికెట్‌కు అజేయంగా 28 పరుగులు జోడించి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.

స్కోరు వివరాలు 
శ్రీలంక ఇనింగ్స్‌: థిమాషిని (సి) రాజేశ్వరి (బి) దీప్తి శర్మ 2; జయాంగని (సి) శిఖా పాండే (బి) రాధా యాదవ్‌ 33; హర్షిత (బి) రాజేశ్వరి 12; హన్సిమ (సి) వేద (బి) రాధా యాదవ్‌ 7; హాసిని (సి) తానియా (బి) రాధా యాదవ్‌ 7; శశికళ సిరివర్దనె (సి) వేద (బి) రాజేశ్వరి 13; నీలాక్షి డిసిల్వా (సి) హర్మన్‌ (బి) పూనమ్‌ 8; అనుష్క (ఎల్బీడబ్ల్యూ) (బి) రాధా యాదవ్‌ 1; దిల్హారీ (నాటౌట్‌) 25; సత్య (బి) శిఖా పాండే 0; ప్రబోధని (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు) 113.
వికెట్ల పతనం: 1–12, 2–42, 3–48, 4–58, 5–75, 6–78, 7–80, 8–104, 9–104.
బౌలింగ్‌: దీప్తి శర్మ 4–0–16–1; శిఖా పాండే 4–0–35–1; రాజేశ్వరి 4–1–18–2; పూనమ్‌ యాదవ్‌ 4–0–20–1; రాధా యాదవ్‌ 4–0–23–4.

భారత్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ వర్మ (రనౌట్‌) 47; స్మృతి (సి) దిల్హారీ (బి) ప్రబోధని 17; హర్మన్‌ప్రీత్‌ (సి) హన్సిమ (బి) శశికళ 15; జెమీమా (నాటౌట్‌) 15; దీప్తి శర్మ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (14.4 ఓవర్లలో మూడు వికెట్లకు) 116 
వికెట్ల పతనం: 1–34, 2–81, 3–88.
బౌలింగ్‌: ప్రబోధని 4–0–13–1; శశికళ 4–0–42–1; సత్య సాందీపని 1–0–11–0; జయాంగని 2–0–21–0; దిల్హారీ 3–0–18–0;  థిమాషిని 0.4–0–7–0.

మరిన్ని వార్తలు