అజేయంగా ముందుకెళ్తారా..! 

29 Feb, 2020 03:09 IST|Sakshi

నేడు లంకతో భారత్‌ నామమాత్రపు పోరు

మెల్‌బోర్న్‌: భారత అమ్మాయిల జట్టు అందరికంటే ముందుగానే సెమీస్‌ చేరింది. ఇప్పుడు అజేయంగా ముందుకెళ్లడంపై దృష్టిపెట్టింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో నేడు గ్రూప్‌‘ఎ’లో జరిగే తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో వరుస విజయాలతో ఊపు మీదుంది. మొదట డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆసీస్‌పై, తర్వాత బంగ్లా, కివీస్‌లను ఓడించిన భారత్‌ ఇప్పుడు గ్రూప్‌ టాపర్‌గా ఉంది. ఇలాంటి జట్టు లంకను ఓడించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. పైగా హర్మన్‌ సేన అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌ విభాగాల్లో దుర్భేద్యంగా ఉంది. అందుకేనేమో సారథి హర్మన్‌ వరుసగా విఫలమవుతున్నా ఆ ప్రభావం జట్టుపై ఏమాత్రం లేదు. 16 ఏళ్ల షఫాలీ వర్మ ప్రత్యర్థుల పాలిట సింహ స్వప్నమవుతోంది. జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు మిడిలార్డర్‌లో తానియా, వేద కృష్ణమూర్తిలు చక్కగా రాణిస్తున్నారు. ఇక బౌలింగ్‌ అయితే బ్యాటింగ్‌కు దీటుగా ఉంది.

గత మూడు మ్యాచ్‌ల్లో మనం చేసిన స్కోర్లను నిలబెట్టిందే బౌలర్లు. స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్, పేసర్‌ శిఖా పాండేలను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఆపసోపాలు పడుతున్నారు. పేలవ ఫామ్‌ను కనబరుస్తున్న హర్మన్‌ప్రీత్‌ గనక ఈ మ్యాచ్‌తో గాడిన పడితే భారత్‌ తిరుగులేని జట్టుగా మారడం ఖాయం. మరోవైపు శ్రీలంక అమ్మాయిలది పూర్తిగా భిన్నమైన పరిస్థితి. భారత్‌ ఆడినవన్నీ గెలిస్తే... లంకేమో ఓడింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ లక్ష్యాల్ని బౌలర్లు కాపాడితే... లంక లక్ష్యాలన్నీ చెదిరిపోయాయి. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ జయాంగని ఫామ్‌లో ఉంది. హర్షిత మాధవి, హాసిని పెరీరాలు కూడా మెరుగ్గా ఆడారు. కానీ బౌలింగ్‌ వైఫల్యం లంకను పరాజయం పాలు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో లంక బౌలర్లు తీసింది 7 వికెట్లే కావడం గమనార్హం. దీనివల్లే లంక లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి. ఇప్పటికే సెమీస్‌ను కష్టం చేసుకున్న లంక... పరువుకోసమైనా గెలిచేందుకు ఆరాటపడుతోంది. ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ను స్టార్‌స్పోర్ట్స్‌–2 చానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది

మరిన్ని వార్తలు