భారత్‌ క్లీన్‌స్వీప్‌

22 Nov, 2019 04:01 IST|Sakshi

గయానా: భారత మహిళల జట్టు ఆఖరి టి20లోనూ జయభేరి మోగించింది. తద్వారా వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 61 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్లు  షఫాలీ వర్మ (9), కెప్టెన్‌ స్మృతి మంధాన (7) విఫలం కాగా, జెమీమా రోడ్రిగ్స్‌ (56 బంతుల్లో 50; 3 ఫోర్లు), వేద కృష్ణమూర్తి (48 బంతుల్లో 57 నాటౌట్‌; 4 ఫోర్లు) అర్ధసెంచరీలతో  ఆదుకున్నారు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 117 పరుగులు జోడించారు. విండీస్‌ బౌలర్లలో హేలీ మాథ్యూస్, అనీసా మొహమ్మద్, ఆలియా తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం 135 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌ మహిళల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 73 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్‌ కైషోన నైట్‌ (22), షెమైన్‌ క్యాంప్‌బెల్లి (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లు అనూజ పాటిల్‌ (2/3), రాధా యాదవ్‌ (1/10), పూనమ్‌ (1/15), పూజ (1/14), హర్లీన్‌ డియోల్‌ (1/13) ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను సమష్టిగా దెబ్బతీశారు.

మరిన్ని వార్తలు