చాంపియన్‌ భారత్‌

18 Oct, 2019 14:48 IST|Sakshi

‘శాఫ్‌’ మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) మహిళల చాంపియన్‌షిప్‌లో భారత్‌ మెరిసింది. భూటాన్‌లో జరిగిన ఈ టోరీ్నలో విజేతగా నిలిచి 9 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలిసారిగా టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. థింపూలోని చలిమితాంగ్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్లో టీమిండియా 5–3తో బంగ్లాదేశ్‌పై టైబ్రేక్‌లో విజయం సాధించింది. భారత్‌ తరఫున షెల్లీదేవి, నిషా, పూరి్ణమ కుమారి, అమీషా, బబినా దేవి గోల్‌ చేయడంలో సఫలీకృతమయ్యారు. బంగ్లా జట్టు తరఫున నస్రీన్, సప్నా రాణి, రూమీ అక్తర్‌ తలా ఓ గోల్‌ సాధించారు. అంతకుముందు లీగ్‌ మ్యాచ్‌ల్లో భారత్‌ రెండింటిలో గెలుపొంది మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 4–1తో గెలిచింది. సుమతి కుమారి (7వ ని.), లిండా కోమ్‌ (38వ ని.) చెరో గోల్‌ సాధించగా... ప్రియాంక (56వ ని., 66వ ని.,) రెండు గోల్స్‌తో చెలరేగింది. నేపాల్‌ జట్టు తరఫున మోన్‌ మయా దామయ్‌ (66వ ని.) ఒక గోల్‌ చేసింది. రెండో మ్యాచ్‌లో భారత్‌ 10–1తో భూటాన్‌ను చిత్తుగా ఓడించింది.

ఈ మ్యాచ్‌లో సాయి సాంకే ( 63వ ని., 64వ ని., 72వ ని.,) మూడు గోల్స్‌తో విజృంభించగా... కిరణ్‌ (15వ ని., 21వ ని.), లిండా కోమ్‌ (19వ ని., 54వ ని.), సుమతి కుమారి (24వ ని., 86వ ని.) తలా రెండు గోల్స్‌ సాధించారు. ప్రియాంక (8వ ని.) ఒక గోల్‌ చేసింది. భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్‌ 1–1తో డ్రాగా ముగిసింది. అమీషా (భారత్‌), సప్నా రాణి (26వ ని.) చెరో గోల్‌ నమోదు చేశారు. ఈ టోర్నీలో భారత జట్టుకు హైదరాబాద్‌కు చెందిన మాజీ అంతర్జాతీయ క్రీడాకారుడు, ఎస్‌బీఐ జట్టు ఫుట్‌బాల్‌ కోచ్‌ జీపీ ఫల్గుణ డిప్యూటీ మేనేజర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు మొహమ్మద్‌ అలీ రఫత్‌ విజేతగా నిలిచిన భారత జట్టును అభినందించారు.

మరిన్ని వార్తలు