టీమిండియా శుభారంభం

19 Sep, 2018 16:29 IST|Sakshi

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సేన 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధానా డకౌట్‌గా వెనుదిరిగారు. ఈ క్రమంలో రోడ్రిగ్స్‌ మరో ఓపెనర్‌ మిథాలీ రాజ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేసారు. జట్టును ఆదుకుంటుందనుకున్న తరణంలో మిథాలీ(17; 11 బంతుల్లో 3ఫోర్లు) స్వల్స స్కోర్‌కే పెవిలియన్‌ బాట పట్టారు.

అయితే ధాటిగా ఆడే ప్రయత్నంలో రోడ్రిగ్స్‌ (36; 15 బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్సర్లు), సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌‌(0) వెనువెంటనే అవట్‌ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ క్రమంలో తాన్యా భాటియా(46; 35 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్సర్‌), అంజూ పాటిల్‌( 36; 29 బంతుల్లో 5 ఫోర్లు), వేదా క్రిష్ణ మూర్తి (21 నాటౌట్‌;15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

అనంతరం 169 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు శుభారంభాన్నందిచారు. ధాటిగా ఆడుతున్న శ్రీలంక ఓపెనర్‌ మెండిస్‌ (32;12 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)ను తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి ఔట్‌ చేసింది. ఆటపట్టు(27;22 బంతుల్లో 5ఫోర్లు), ఇషానీ (45; 31 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సర్‌) తప్పా మిగిలిన ఆటగాళ్లు రాణించకపోవడంతో శ్రీలంక 19.3 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. భారత బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు తీయగా, రాధా యాదవ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తలో రెండు వికెట్లు తీయగా, అంజూ పాటిల్‌, అరంధతి రెడ్డి చెరో వికెట్‌ సాధించారు. ఇరు జట్లు మధ్య రెండో టీ20 మ్యాచ్‌ ఈ నెల 21న(శుక్రవారం) జరుగనుంది.


 

మరిన్ని వార్తలు