50 పరుగులే చేసి 5 పరుగులతో గెలిచారు..

18 Nov, 2019 11:41 IST|Sakshi

గయానా: ఇప్పటికే వెస్టిండీస్‌ మహిళలతో టీ20 సిరీస్‌ను గెలిచిన భారత మహిళలు అదే జోరును కొనసాగిస్తున్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా నాల్గో విజయం నమోదు చేశారు. ఆదివారం జరిగిన నాల్గో టీ20లో భారత్‌ మహిళలు ఏడు వికెట్ల నష్టానికి 50 పరుగులే చేయగా, ఐదు పరుగుల తేడాతో జయభేరి మోగించారు. ఈ మ్యాచ్‌కు పలుమార్లు వర్షం ఆటంకం కల్గించడంతో 9 ఓవర్లకు కుదించారు. దాంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 51 పరుగుల టార్గెట్‌ నిర్దేశించింది. కేవలం పుజా వస్త్రాకర్‌(10) మాత్రమే రెండంకెల స్కోరును దాటిన భారత క్రీడాకారిణి.  

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ మహిళలు 9 ఓవర్లలో 45 పరుగులే చేసి ఓటమి పాలయ్యారు. వెస్టిండీస్‌ జట్టులో హేలీ  మాథ్యూస్‌(11), చినెల్లీ హెన్రీ(11), మెక్‌లీన్‌(10)లు రెండంకెల స్కోరు దాటారు. అయినప‍్పటికీ మ్యాచ్‌ను గెలిపించలేపోయారు. భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో వెస్టిండీస్‌ విఫలమైంది. భారత బౌలర్లలో అనుజా పటేల్‌ రెండు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసి ఎనిమిది పరుగులే ఇవ్వగా, దీప్తి శర్మ, రాధా యాదవ్‌లు తలో రెండు ఓవర్లలో ఎనిమిదేసి పరుగులిచ్చి వికెట్‌ చొప్పున తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో విజయంతో భారత మహిళలు 4-0 ఆధిక్యంలో నిలిచారు. ఐదో టీ20 బుధవారం జరుగనుంది.

మరిన్ని వార్తలు