తొలి వన్డేలో భారత్ ఘన విజయం

10 Nov, 2016 16:32 IST|Sakshi
తొలి వన్డేలో భారత్ ఘన విజయం

మూలపాడు(విజయవాడ):మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్ మహిళలతో జరిగిన తొలి మ్యాచ్లో భారత మహిళలు ఘన విజయం సాధించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ ను 131 పరుగులకే కూల్చేసిన భారత్.. ఆ తరువాత నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు దీప్తి శర్మ(16), మందనా(7)లు నిరాశపరిచినా, కెప్టెన్ మిథాలీ రాజ్(46 నాటౌట్), వేద కృష్ణమూర్తి(52 నాటౌట్) రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించారు. దాంతో భారత జట్టు 39.1 ఓవర్లలోలక్ష్యాన్ని అందుకుని సిరీస్ లో 1-0తో ఆధిక్యం సాధించారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్ 132 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. హెలే మాథ్యూస్(24), అగ్విల్లెరియా(42 నాటౌట్)లు మాత్రమే విండీస్ జట్టులో మోస్తరుగా ఆకట్టుకున్నారు. విండీస్ మహిళల్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.భారత మహిళల్లో ఏక్తా బిష్ మూడు వికెట్లు సాధించగా,రాజేశ్వరి గైక్వాడ్ కు రెండు వికెట్లు లభించాయి. జూలన్ గోస్వామి, శిఖా పాండేలు తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే నవంబర్ 13 వ తేదీన జరుగనుంది.

>
మరిన్ని వార్తలు