మా క్రికెట్‌ కోచ్‌ ఓవర్‌ చేస్తున్నాడు..!

14 Jun, 2018 13:19 IST|Sakshi

ముంబై: భారత మహిళా క్రికెట్‌ జట్టు ఆన్‌ ఫీల్డ్‌ వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చుతున్న ప్రధాన కోచ్‌ తుషార్‌ అరోథిని తప్పించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. గత కొంతకాలంగా జట్టు సెలక్షన్‌ విషయాలతో పాటు ఫీల్డ్‌లో ఆడేటప్పుడు తుషార్‌ అతిగా వ్యవహరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ మేరకు బుధవారం భారత మహిళా క్రికెట్‌ జట్టు బృందం బీసీసీఐని కలిసి కోచ్‌ తుషార్‌పై ఫిర్యాదు చేశారు. ప్రధానంగా కొన్ని నిర్ణయాలు కెప్టెన్‌ మాత్రమే తీసుకోవాల్సి ఉండగా, కోచ్‌గా తుషార్‌ మాత్రం ఓవర్‌ చేస్తూ విపరీతమైన స్వేచ్ఛను తీసుకుంటున్నాడంటూ ఆరోపించారు.

ముందుగా సెలక్షన్‌ కమిటీకి తమ సమస్యను విన్నవించిన క్రీడాకారిణులు.. ఆపై బీసీసీఐతో సమావేశమయ్యారు. గతవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియాకప్‌ ఫైనల్లో ఓడిపోవడానికి తుషార్ ఎలా కారణమయ్యాడనేది బీసీసీఐ సమావేశంలో ప్రస్తావించారు. తుది జట్టును ఎంపిక చేసేటప్పుడు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను పూర్తిగా పక్కకు పెట్టిన కోచ్‌.. ఏకపక్షం నిర్ణయాలు తీసుకున్నాడని ఆరోపించారు. ఫైనల్‌ మ్యాచ్‌కు జట్టు ఎంపిక బాలేదని హర్మన్‌ చెప్పినా, తుషార్‌ వినలేదని బీసీసీఐ పెద్దలకు విన్నవించినట్లు సమాచారం. దీనిలో భాగంగా తుషార్‌ అరోథిని కోచ్‌గా కొనసాగించవద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు