హ్యాట్రిక్‌తో సెమీస్‌ 

28 Feb, 2020 00:53 IST|Sakshi

అమెలియా వణికించినా... గెలిచిన భారత్‌

షఫాలీ మళ్లీ ధనాధన్‌ 

భారత మహిళలకు ‘హ్యాట్రిక్‌’ విజయమైతే దక్కింది. అందరికంటే ముందే సెమీస్‌కు వెళ్లింది. కానీ ఆట ఆఖరి పోరాటమే అందరినీ మునికాళ్లపై నిలబెట్టింది. క్రికెటర్ల వెన్నుల్లో వణుకుపుట్టించింది. ఆఖరి బంతి పడక ముందు ఇరుజట్లకు సమాన అవకాశాలున్నాయి. పడ్డాక భారత్‌ గెలిచింది... కానీ కివీస్‌ పోరాటం అదిరింది. ఈ మెగా ఈవెంట్‌కే హైలైట్‌ అయిన మ్యాచ్‌తో అందరికీ క్రికెట్‌ మజా దక్కింది.

మెల్‌బోర్న్‌: ఔరా... మన అమ్మాయిల జట్టు సైరా! న్యూజిలాండ్‌తో ఆడి గెలిచింది. పోరాడి సెమీస్‌ చేరింది. ఉన్నపళంగా ఉత్కంఠ పెంచిన ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3 పరుగుల తేడాతో కివీస్‌పై నెగ్గింది. ఈ టి20 ప్రపంచకప్‌కే కిక్కెక్కించే ఈ మ్యాచ్‌లో కివీస్‌ చివరి బంతిదాకా గెలుపోటముల త్రాసులో నిలిచింది. చివరకు శిఖా యార్కర్‌కు ఓడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. ఓపెనింగ్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షఫాలీ వర్మ (34 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మళ్లీ దంచేసింది. 14 ఓవర్ల దాకా ఇన్నింగ్స్‌ను ఆమెనే నడిపించింది. జ్వరం నుంచి కోలుకున్న స్మృతి మంధాన (11) విఫలం కాగా, తానియా (25 బంతుల్లో 23; 3 ఫోర్లు) మిగతా వారి కంటే మెరుగ్గా ఆడింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (1) విఫలయాత్ర కొనసాగింది.

కివీస్‌ కెప్టెన్‌ సోఫీ డివైన్‌ ఏకంగా ఏడుగురు బౌలర్లను రంగంలోకి దించి భారత ఇన్నింగ్స్‌ను చక్కగా కట్టడి చేసింది. మార్చి మార్చి ప్రయోగించిన బౌలర్లతో ఇబ్బంది పడిన జెమీమా రోడ్రిగ్స్‌ (10), దీప్తి శర్మ (8), వేద (6) పరుగులు చేయలేకపోయారు. రోజ్‌మేరి మెయిర్, అమెలియా కెర్‌ చెరో 2 వికెట్లు తీశారు. తహుహు, సోఫీ ఒక్కో వికెట్‌ పడేశారు. తర్వాత కివీస్‌ ముందరి కాళ్లకు ముందే బంధం వేశారు భారత బౌలర్లు. ఓపెనర్లు ప్రియెస్ట్‌ (12), సోఫీ (14), వన్‌డౌన్‌లో సుజీ బేట్స్‌ (6) అవుట్‌ కావడంతో 34 పరుగులకే ‘టాప్‌’ లేచింది. ఈ దశలో మ్యాడీ గ్రీన్‌ (23 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌), కేటీ మార్టిన్‌ (28 బంతుల్లో 25; 3 ఫోర్లు) న్యూజిలాండ్‌ను ఓ దారికి తెచ్చారు. చివర్లో అమెలియా కెర్‌ (19 బంతుల్లో 34 నాటౌట్‌; 6 ఫోర్లు) శివమెత్తడంతో సాఫీగా సాగుతున్న మ్యాచ్‌ ఉత్కంఠకు తెరలేపింది. భారత బౌలర్లు దీప్తి, శిఖా, రాజేశ్వరి, పూనమ్, రాధ తలా ఒక వికెట్‌ తీశారు.
 
షఫాలీ వర్మ 34 బంతుల్లో 46, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు

టెన్షన్‌... టెన్షన్‌...
18వ ఓవర్‌ ముగిసే సరికి కివీస్‌ స్కోరు 100/2. గెలిచేందుకు ఇంకా 12 బంతుల్లో 34 చేయాలి. ఈ సమీకరణం భారత అమ్మాయిల జట్టుకే అనుకూలం. ఇక సెమీస్‌ బాటలో హ్యాట్రిక్‌ విజయమే అనుకుంటే... అమెలియా కెర్‌ బౌండరీలతో జూలు విదిల్చింది. పూనమ్‌ వేసిన 19 ఓవర్లో 18 పరుగులు పిండేసింది. ఆఖరి ఓవరే మిగిలింది. 16 పరుగులు కావాల్సివుంది. మారిన సమీకరణం మన అమ్మాయిల్ని ఒత్తిడిలోకి నెట్టింది. శిఖాపాండే ఆఖరి ఓవర్లో తొలి బంతి బౌండరీకెళ్లింది. 12 చేస్తే గెలుపే. 3 సింగిల్స్‌ తర్వాత 2 బంతుల్లో 9 చేయాలి. ఇక్కడ మరో ఫోర్‌. ఆఖరి బంతికి 5 పరుగులు కావాలి. ఫోర్‌ వస్తే మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళుతుంది.  ఉత్కంఠ అమాంతం పెరిగింది. ప్రేక్షకులు ఒళ్లంతా కళ్లు చేసుకున్నారు. శిఖా యార్కర్‌ కెర్‌ మతిపోగొట్టింది. అంతే ఓ పరుగొచ్చాక ఇంకో సింగిల్‌ తీసేలోపే జెన్సన్‌ రనౌటైంది. ఆఖరిదాకా చెమటలు కక్కిన భారత మహిళలు 3 పరుగులతో గెలిచి ఊపిరిపీల్చుకున్నారు.

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ వర్మ (సి) జెన్సన్‌ (బి) కెర్‌ 46; మంధాన (బి) తహుహు 11; తానియా (సి) కెర్‌ (బి) మెయిర్‌ 23; జెమీమా (సి) కెర్‌ (బి) మెయిర్‌ 10; హర్మన్‌ప్రీత్‌ (సి) అండ్‌ (బి) కాస్పెరెక్‌ 1; దీప్తి (సి) జెన్సన్‌ (బి) డివైన్‌ 8; వేద ఎల్బీడబ్ల్యూ (బి) కెర్‌ 6; శిఖా నాటౌట్‌ 10; రాధ రనౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 133.
వికెట్ల పతనం: 1–17, 2–68, 3–80, 4–93, 5–95, 6–104, 7–111, 8–133.
బౌలింగ్‌: తహుహు 2–0–14–1, మెయిర్‌ 3–0–27–2, డివైన్‌ 2–0–12–1, పీటర్సన్‌ 2–0–19–0, జెన్సన్‌ 3–0–20–0, కెర్‌ 4–0–21–2, కాస్పెరెక్‌ 4–0–19–1.

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: ప్రియెస్ట్‌ (సి) రాధ (బి) శిఖా 12; డివైన్‌ (సి) రాధ (బి) పూనమ్‌ 14; సుజీ బేట్స్‌ (బి) దీప్తి 6; మ్యాడీగ్రీన్‌  (సి) తానియా (బి) రాజేశ్వరి 24; మార్టిన్‌ (సి) రోడ్రిగ్స్‌ (బి) రాధ 25; కెర్‌ నాటౌట్‌ 34; జెన్సన్‌ రనౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 130. 
వికెట్ల పతనం: 1–13, 2–30, 3–34, 4–77, 5–90, 6–130. 
బౌలింగ్‌: దీప్తిశర్మ 4–0–27–1, శిఖాపాండే 4–0–21–1, రాజేశ్వరి 4–0–22–1, పూనమ్‌ 4–0–32–1, రాధ 4–0–25–1.

>
మరిన్ని వార్తలు