రెండు గేమ్‌లే కోల్పోయి...రెండింటిలోనూ గెలిచి...

30 Nov, 2019 00:46 IST|Sakshi

భారత్‌కు 2–0 ఆధిక్యం

అలవోకగా నెగ్గిన రామ్‌కుమార్, సుమీత్‌ నాగల్‌

పాక్‌తో డేవిస్‌ కప్‌ మ్యాచ్‌

ఊహించినట్టే జరిగింది. పేరుకు చిరకాల ప్రత్యర్థి అయినా... పాకిస్తాన్‌తో భారత టెన్నిస్‌ జట్టు ఓ ఆటాడుకుంది. కేవలం రెండంటే రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 మ్యాచ్‌లో 2–0తో ఆధిక్యం సంపాదించింది. నేడు రెండు రివర్స్‌ సింగిల్స్, ఒక డబుల్స్‌ మ్యాచ్‌ జరుగుతాయి. ఒక దాంట్లో భారత్‌ నెగ్గినా... వచ్చే ఏడాది మార్చిలో జరిగే వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌తో క్రొయేషియా జట్టుతో పోరుకు సిద్ధమవుతుంది.

నూర్‌–సుల్తాన్‌ (కజకిస్తాన్‌): ఏమాత్రం అనుభవంలేని ఆటగాళ్లను పంపించిన పాకిస్తాన్‌ టెన్నిస్‌ జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అనామకులైనప్పటికీ భారత యువ తారలు సహజశైలిలో ఆడి అలవోక విజయాలు అందుకున్నారు. ఫలితంగా పాకిస్తాన్‌తో తటస్థ వేదికపై శనివారం మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 డేవిస్‌ కప్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–0తో ఆధిక్యాన్ని దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 176వ ర్యాంకర్, 25 ఏళ్ల రామ్‌కుమార్‌ రామనాథన్‌ 6–0, 6–0తో 17 ఏళ్ల షోయబ్‌ మొహమ్మద్‌పై గెలిచాడు.

42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ ఐదు ఏస్‌లు సంధించాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ఇంకా పేరు కూడా నమోదుకాని షోయబ్‌ రెండు సెట్‌లలోనూ తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా నిలబెట్టుకోలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో ప్రపంచ 131వ ర్యాంకర్, 22 ఏళ్ల సుమీత్‌ నాగల్‌ 6–0, 6–2తో 17 ఏళ్ల అబ్దుల్‌ హుజైఫా రెహ్మాన్‌పై గెలిచాడు. 64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సుమీత్‌ రెండో సెట్‌లో రెండు గేమ్‌లను కోల్పోయాడు. మూడో మ్యాచ్‌గా నేడు జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో లియాండర్‌ పేస్‌–జీవన్‌ నెడుంజెళియన్‌ జోడీ అబ్దుల్‌ హుజైఫా రెహ్మాన్‌–షోయబ్‌ మొహమ్మద్‌ జంటతో ఆడుతుంది.

మరిన్ని వార్తలు