ఆసియా కప్ విజేత భారత్

7 Mar, 2016 07:04 IST|Sakshi
ఆసియా కప్ విజేత భారత్

మిర్పూర్:
ఆసియాకప్లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన తుది పోరులో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లా విసిరిన 121 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఓవర్లోనే ఓపెనర్ రోహిత్ శర్మ(1) వికెట్ కోల్పోయింది. అనంతరం కోహ్లీ, ధావన్లు నిలకడగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. విజయానికి 25 పరుగులు కావల్సి ఉన్న సమయంలో ధావన్(60 పరుగులు, 44 బంతులు, 9ఫోర్స్, 1 సిక్స్) క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.  అనంతరం ధోనీ(20), కోహ్లీ (41 పరుగులు, 28 బంతులు, 5ఫోర్స్)లు విజయానికి కావల్సిన మిగతా పరుగులను రాబట్టారు. ధోనీ తనదైన శైలిలో చివర్లో సిక్సర్లతో మెరుపులు మెరిపించడంతో 7 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. ధాటిగా ఆడి భారత్ విజయంలో కీలక పాత్రపోషించిన ధావన్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' లభించింది.


టాస్ గెలిచిన టీమిండియా తొలుత బంగ్లాదేశ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్(13), సౌమ్య సర్కార్(14)లు నిరాశపరచగా, షకిబుల్ హసన్(21) మోస్తరుగా రాణించాడు. షకిబుల్ మూడో వికెట్ గా పెవిలియన్కు చేరే సరికి బంగ్లాదేశ్ స్కోరు 64 పరుగులు మాత్రమే. అటు తరువాత బంగ్లాదేశ్ స్వల్ప వ్యవధిలో ముష్ఫికర్ రహీమ్(4), మోర్తజా(0) వికెట్లను నష్టపోయింది. కాగా, ఆ తరుణంలో షబ్బిర్ రెహ్మాన్(32 నాటౌట్) , మహ్మదుల్లా(33 నాటౌట్)లు దూకుడుగా ఆడారు. ఈ జోడి ప్రత్యేకంగా హార్దిక్ పాండ్యా వేసిన 14వ ఓవర్లో 21 పరుగులను పిండుకోవడంతో బంగ్లాదేశ్ స్కోరు బోర్డు వేగంగా కదిలింది. అయితే చివరి ఓవర్లో బూమ్రా ఏడు పరుగులను మాత్రమే ఇవ్వడంతో బంగ్లాదేశ్ 15.0 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. భారత బౌలర్లలో  ఆశిష్ నెహ్రా, అశ్విన్, బూమ్రా, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది.


అంతకుముందు వరుణుడు అంతరాయం కల్గించడంతో మ్యాచ్ను అనుకున్న సమయానికి నిర్వహించడం సాధ్యపడలేదు. కాగా, రాత్రి గం.8.30ని.లకు పిచ్ను, అవుట్ ఫీల్డ్ ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ ను 15.0 ఓవర్లపాటు జరిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు