శ్రీలంక గడ్డపై భారత్‌ సంపూర్ణ విజయం

7 Sep, 2017 09:00 IST|Sakshi
శ్రీలంక గడ్డపై భారత్‌ సంపూర్ణ విజయం

ఏకైక టి20లో 7 వికెట్లతో ఘన విజయం
గెలిపించిన కోహ్లి, మనీశ్‌ పాండే
ఆతిథ్య జట్టుకు శూన్యహస్తం   


మూడు ఫార్మాట్లు... ఆటగాళ్లు మారారు... వేదికలు మారాయి... కానీ ఫలితం మాత్రం మారనే లేదు. శ్రీలంక గడ్డపై భారత జట్టు దిగ్విజయ యాత్ర పూర్తయింది. ఆడిన తొమ్మిది అంతర్జాతీయ మ్యాచ్‌లలోనూ అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా సంపూర్ణ విజయాన్ని సాధించింది. తిరుగులేని ఆటతో ప్రత్యర్థిని చెడుగుడు ఆడుకున్న టీమిండియా సగర్వంగా పర్యటన ముగించింది. సొంతగడ్డపై కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేని అశక్తతతో, అవమాన భారంతో ఆతిథ్య శ్రీలంక ఖాతాలో అతి పెద్ద శూన్యం చేరింది.

171 పరుగుల విజయలక్ష్యం... 42 పరుగులకు 2 వికెట్లు పడ్డాయి. అయితే ఎప్పటిలాగే తనదైన శైలిలో వేటగాడు విరాట్‌ కోహ్లి ఆడుతూ పాడుతూ ఫినిషింగ్‌ లైన్‌ దిశగా జట్టును నడిపించాడు. అతనికి మనీశ్‌ పాండే అండగా నిలవడంతో భారత్‌ ఏ దశలోనూ ఆందోళన చెందాల్సిన అవసరమే రాలేదు. మూడో వికెట్‌కు వీరిద్దరు 119 పరుగులు జోడించడంతో జట్టుకు సునాయాస గెలుపు దక్కింది. 48 రోజుల లంక టూర్‌ అమితానందంతో ముగిసింది. ముఖ్యంగా ఈ పర్యటన మాజీ కెప్టెన్‌ ధోనికి తీపి జ్ఞాపకాలు మిగిల్చింది. ఈ సిరీస్‌ మొత్తంలో ధోని ఒక్కసారి కూడా అవుట్‌ కాకపోవడం విశేషం.

కొలంబో: విరాట్‌ కోహ్లి నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనను చిరస్మరణీయంగా మార్చుకుంది. టెస్టు, వన్డే సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేసిన జట్టు పొట్టి క్రికెట్‌లోనూ తమ పదును చూపించింది. బుధవారం ఇక్కడ జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దిల్షాన్‌ మునవీరా (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, అషాన్‌ ప్రియాంజన్‌ (40 బంతుల్లో 40 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. చహల్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విరాట్‌ కోహ్లి (54 బంతుల్లో 82; 7 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగిపోగా... మనీశ్‌ పాండే (36 బంతుల్లో 51 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో అతనికి సహకరించాడు. తాజా విజయంతో మూడు ఫార్మాట్‌లలో కలిపి భారత్‌ 9–0 తేడాతో లంకను ఓడించినట్లయింది.
 
మునవీరా జోరు...

తొలి 10 ఓవర్లలో 90 పరుగులు...తర్వాతి 8 ఓవర్లలో 54 పరుగులు...చివరి 2 ఓవర్లలో 26 పరుగులు... సంక్షిప్తంగా శ్రీలంక ఇన్నింగ్స్‌ సాగిన తీరు ఇది. భారత్‌తో రెండు వన్డేల్లో విఫలమైన మునవీరా టి20లో సత్తా చాటగా... ఈ మ్యాచ్‌తో టి20ల్లో అరంగేట్రం చేసిన ప్రియాంజన్‌ లంక ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించాడు. బుమ్రా వేసిన రెండో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి శుభారంభం అందించిన డిక్‌వెలా (17) చివరకు అతని బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. అంతకుముందు భువనేశ్వర్‌ ఓవర్లో తరంగ (5) కూడా క్లీన్‌బౌల్డయ్యాడు. మరోవైపు మునవీరా తన ధాటిని ప్రదర్శించాడు. చహల్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అతను, అక్షర్‌ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు.

ధోని అద్భుత స్టంపింగ్‌తో మాథ్యూస్‌ (7)ను వెనక్కి పంపించగా, చహల్‌ మరో ఓవర్లో మునవీరా 2 సిక్సర్లు, ఫోర్‌తో పండగ చేసుకున్నాడు. 26 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. చివరకు కుల్దీప్, మునవీరా ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఆ తర్వాత చహల్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు కట్టి పడేయడంతో లంక పరుగులు చేయడంలో ఇబ్బంది పడింది. అయితే చివరి 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు రాబట్టిన ఆ జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది.  

అదే జోరు...
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ ఆరంభంలోనే రోహిత్‌ (9) వికెట్‌ కోల్పోయింది. రాహుల్‌ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయితే కోహ్లి, పాండే భాగస్వామ్యం భారత్‌ను విజయం వైపు నడిపించింది. శ్రీలంక బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్‌కు మొదట్లో పరుగులు తీయడంలో వీరిద్దరు కాస్త ఇబ్బంది పడ్డారు. కొన్ని ఉత్కంఠ క్షణాలు కూడా ఎదుర్కొన్నారు. ఫలితంగా పవర్‌ప్లేలో స్కోరు 43 పరుగులకే పరిమితమైంది. అయితే ఒక్కసారి నిలదొక్కుకున్న తర్వాత ఈ జంట సాధికారికంగా ఆడింది. ముఖ్యంగా కోహ్లి ఏ బౌలర్‌నూ వదల్లేదు. పెరీరా ఓవర్లో మూడు ఫోర్లతో 15 పరుగులు రాబట్టిన భారత్‌... మాథ్యూస్‌ వేసిన ఓవర్లో మరో 17 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లు నియంత్రణ తప్పడంతో టీమిండియాకు సునాయాసంగా పరుగులు లభించాయి. ఈ క్రమంలో 30 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గెలుపునకు చేరువైన దశలో కోహ్లి వెనుదిరిగినా... పాండే మిగతా పనిని పూర్తి చేశాడు.