ఐదేళ్ల క్రితం టీమిండియా...

23 Jun, 2018 09:27 IST|Sakshi

సరిగ్గా ఐదేళ్ల క్రితం మినీ ప్రపంచకప్‌గా భావించే చాంపియన్స్‌ ట్రోఫీని టీమిండియా ముద్దాడిన రోజు. ఆ మధుర క్షణాలకు నేటితో(జూన్‌ 23) సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఐసీసీ ఓ ట్వీట్‌ ద్వారా ఆ మధుర క్షణాలను గుర్తు చేసింది. 2013లో జరిగిన ఈ మెగా టోర్నీని ఇంగ్లండ్‌, వేల్స్‌ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. మినీ ప్రపంచ కప్‌గా భావించే ఈ టోర్నీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ జట్టుపై ఐదు పరుగుల తేడాతో ధోని సేన అపురూప విజయం సాధించింది. మెగా టోర్నీని ఆ దఫా మాత్రమే టీ20 ఫార్మట్‌లో నిర్వహించటం విశేషం. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం 130 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ సులభంగా ఛేదించేలా కనిపించింది. 20 బంతుల్లో 22 పరుగులు చేయాలి, చేతిలో ఆరు వికెట్లు ఉండటంతో మ్యాచ్‌ ఇంగ్లండ్‌కే అనుకూలంగా మారింది. ఈ తరుణంలో ఇషాంత్‌ శర్మ వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. చివర్లో ధోని మాస్టర్‌ కెప్టెన్సీ, బౌలర్ల కట్టదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడికి గురైన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా రెండో సారీ చాంపియన్స్‌ ట్రోఫీని గెలచుకుంది.  

ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’‌,  సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి. టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీ గెలవటం ఇది రెండో సారి. గతంలో(2002) గంగూలీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ట్రోఫీని గెలుచుకుంది. 

మరిన్ని వార్తలు