ఊదేశారు!

18 Jul, 2015 07:53 IST|Sakshi
ఊదేశారు!

తొలి టి20లో భారత్ గెలుపు
 రాణించిన ఉతప్ప, విజయ్
 స్పిన్ ఉచ్చుకు జింబాబ్వే విలవిల
 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అక్ష
ర్
 
 5 ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదుగురు పాండే, జాదవ్, అక్షర్ పటేల్, బిన్నీ, సందీప్‌లు టి20ల్లో అరంగేట్రం చేశారు.
 
 టి20 ప్రపంచకప్ ఆడిన అనుభవం ఉన్న ఉతప్ప, హర్భజన్ మినహా ప్రస్తుత భారత జట్టులోని మిగతా ఆటగాళ్లందరూ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవారే. లీగ్‌లో ఆడిన అనుభవాన్ని తమలోని నైపుణ్యానికి జోడించి విదేశీ గడ్డపై జింబాబ్వేను ఉఫ్‌మని ఊదేశారు. సీనియర్లు లేరన్న లోటును మరిపిస్తూ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. దీంతో తొలి టి20లో టీమిండియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
 
 హరారే: వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న భారత్.. టి20లోనూ సత్తా చాటింది. బ్యాటింగ్‌లో రాబిన్ ఉతప్ప (35 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు), మురళీ విజయ్ (19 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరిస్తే.. బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (3/17), హర్భజన్ (2/29)లు తమ మాయాజాలాన్ని చూపించారు. ఫలితంగా  శుక్రవారం జరిగిన టి20 మ్యాచ్‌లో భారత్ 54 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
 
  టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. తర్వాత జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులే చేసి ఓడింది. మసకద్జా (24 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. చిబాబా (27 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. అక్షర్ పటేల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆదివారం రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది.
 
 ఓపెనర్ల శుభారంభం
 పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం, ఆతిథ్య పేసర్ల నుంచి పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో భారత ఓపెనర్లు రహానే (32 బంతుల్లో 33; 2 ఫోర్లు), విజయ్‌లు ఆరంభంలో చెలరేగి ఆడారు. బౌండరీల జోరుతో స్కోరును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఏడు ఓవర్లలోనే ఈ జోడి తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించింది. అయితే ఇదే ఓవర్‌లో రజా మిడ్‌వికెట్ నుంచి వేసిన డెరైక్ట్ త్రోకు విజయ్ అనూహ్యంగా రనౌటయ్యాడు. తర్వాత రిస్క్ తీసుకోకుండా ఉతప్పతో కలిసి సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్‌ను రొటేట్ చేసిన కెప్టెన్ రహానే 10వ ఓవర్‌లో క్రెమెర్ బంతికి పెవిలియన్‌కు చేరాడు. దీంతో భారత్ 82 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఇక ఇక్కడి నుంచి జింబాబ్వే స్లో బౌలర్లు టీమిండియా పరుగుల వేగానికి కళ్లెం వేశారు. మనీష్ పాండే (19 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) భారీ సిక్సర్‌తో రెచ్చిపోయినా... 5 ఓవర్లలో (10 నుంచి 14) కేవలం 31 పరుగులు మాత్రమే ఇచ్చారు.
 
  16వ ఓవర్‌లో మనీష్ అవుట్‌కావడం భారత్ భారీ స్కోరుపై ప్రభావం చూపింది. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. చివర్లో కేదార్ జాదవ్ (9), స్టువర్ట్ బిన్నీ (6 బంతుల్లో 11; 1 సిక్స్) వరుస విరామాల్లో వెనుదిరిగారు. ఆఖరి బంతికి హర్భజన్ (8 నాటౌట్) ఫోర్ కొట్టి భారత ఇన్నింగ్స్‌కు మంచి ముగింపు ఇచ్చాడు. మెంపోయు 3 వికెట్లు తీశాడు.
 
 స్పిన్నర్ల జోరు
 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వేను స్పిన్నర్లు హర్భజన్, అక్షర్ పటేల్ ఘోరంగా దెబ్బతీశారు. ఆరంభంలో ఓపెనర్లు మసకద్జా, చిబాబా మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. సందీప్, భజ్జీ బౌలింగ్‌లో ఈ జోడి సిక్సర్లు బాదడంతో తొలి వికెట్‌కు 55 పరుగులు సమకూరాయి. కానీ పదో ఓవర్ నుంచి స్పిన్నర్లు తమ మాయాజాలాన్ని చూపెట్టారు. 10 బంతుల వ్యవధిలో మసకద్జా, చిగుంబురా (1), కోవెంట్రీ (10)లను అవుట్ చేశారు.
 
 మరో 17 బంతుల తేడాలో ఇర్విన్ (2) కూడా వెనుదిరగడంతో జింబాబ్వే 14 ఓవర్లలో 82 పరుగులకు సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. తర్వాత సికిందర్ రజా (10), క్రెమెర్ (9)లు నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా భారత బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. కనీసం సింగిల్స్ కూడా రాకపోవడంతో భారీ షాట్లకు ప్రయత్నించి ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. చివర్లో ఉత్సేయా (13 నాటౌట్), మజ్దీవా (14 నాటౌట్)... భువీ, సందీప్ ఓవర్లలో చెరో సిక్సర్, ఫోర్ కొట్టి భారత్ విజయాన్ని కాస్త ఆలస్యం చేశారు.
 
 స్కోరు వివరాలు
 భారత్ ఇన్నింగ్స్: రహనే (సి) మసకద్జా (బి) క్రెమెర్ 33; విజయ్ రనౌట్ 34; ఉతప్ప నాటౌట్ 39; పాండే (సి) రజా (బి) మెంపోయు 19; జాదవ్ (సి) మసకద్జా (బి) మెంపోయు 9; బిన్నీ (సి) క్రెమెర్ (బి) మెంపోయు 11; హర్భజన్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 25; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178.
 
 వికెట్ల పతనం: 1-64; 2-82; 3-127; 4-150; 5-166. బౌలింగ్: ఉత్సేయా 4-0-30-0; మెంపోయు 4-0-33-3; ముజరబాని 3-0-36-0; మద్జీవా 4-0-46-0; క్రెమెర్ 4-1-20-1; రజా 1-0-2-0. జింబాబ్వే ఇన్నింగ్స్: మసకద్జా (సి) జాదవ్ (బి) అక్షర్ 28; చిబాబా (సి) మనీష్ (బి) హర్భజన్ 23; కోవెంట్రీ (సి) రహానే (బి) హర్భజన్ 10; చిగుంబురా (బి) అక్షర్ 1; సికిందర్ రజా (బి) అక్షర్ 10; ఇర్విన్ రనౌట్ 2; క్రెమెర్ (బి) మోహిత్ 9; ఉత్సేయా నాటౌట్ 13; మజ్దీవా నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 124.
 వికెట్ల పతనం: 1-55; 2-64; 3-66; 4-68; 5-82; 6-90; 7-98. బౌలింగ్: భువనేశ్వర్  4-0-22-0; సందీప్ 3-0-34-0; మోహిత్ 3-0-8-1; అక్షర్ పటేల్ 4-0-17-3; హర్భజన్ 4-0-29-2; స్టువర్ట్ బిన్నీ 2-0-8-0.
 

మరిన్ని వార్తలు