నాలుగో వన్డేలోనూ భారత్ ఘన విజయం

2 Aug, 2013 01:37 IST|Sakshi
నాలుగో వన్డేలోనూ భారత్ ఘన విజయం

 మళ్లీ అదే ఫలితం...దుర్భేద్యమైన భారత జట్టు ముందు జింబాబ్వే మరో సారి తలవంచింది. ప్రతీ వన్డేకు తీసికట్టుగా మారుతున్న జింబాబ్వే ఆటతీరు మరింత దిగజారడంతో టీమిండియాకు మరో సునాయాస విజయం దక్కింది. ఊహించినట్లుగానే సిరీస్ ఏకపక్షంగా ముగింపునకు వచ్చింది. ఇది మిగిలింది కోహ్లి సేన క్లీన్ స్వీప్ చేయడమే.
 
 బులవాయో: జింబాబ్వే పర్యటనలో భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్ గెలుచుకున్న ఇండియా, పసికూనపై తన దూకుడు తగ్గించలేదు. ఫలితంగా గురువారం ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 4-0 ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 42.4 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. చిగుంబురా (66 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు), వాలర్ (77 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించారు.
 
 అమిత్ మిశ్రాకు 3 వికెట్లు దక్కగా, మోహిత్ శర్మ, జడేజా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 30.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 145 పరుగులు చేసి విజయం సొంతం చేసుకుంది. సురేశ్ రైనా (71 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు), రోహిత్ శర్మ (90 బంతుల్లో 64 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు అభేద్యంగా 122 పరుగులు జోడించి భారత్‌ను గెలిపించారు. అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే కీలక వికెట్లు తీసి సత్తా చాటిన మోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్‌లో చివరిదైన ఐదో వన్డే శనివారం ఇదే మైదానంలో జరుగుతుంది.
 
 ఆదుకున్న భాగస్వామ్యం...
 టాస్ గెలిచిన భారత కెప్టెన్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ధావన్, వినయ్ కుమార్‌ల స్థానంలో చతేశ్వర్ పుజారా, మోహిత్ శర్మలకు భారత్ తరఫున తొలి వన్డే ఆడే అవకాశం దక్కింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే ఓపెనర్లు సిబాందా (45 బంతుల్లో 24; 3 ఫోర్లు), సికందర్ (7) పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
 
 ముఖ్యంగా మోహిత్ శర్మ తొలి మ్యాచ్‌లోనే చక్కటి బంతులతో ఆకట్టుకున్నాడు. ఆరంభంలోనే సికందర్‌ను అవుట్ చేయడంతో మోహిత్ కెరీర్‌లో తొలి వికెట్ చేరింది. ఆ వెంటనే జడేజా అద్భుతమైన ఫీల్డింగ్‌కు మసకద్జా రనౌట్‌గా వెనుదిరిగాడు. కొద్ది సేపటికే జింబాబ్వేకు షాక్ తగిలింది. కెప్టెన్ టేలర్ (0) డకౌట్ కాగా, ఒకే స్కోరు వద్ద విలియమ్స్ (0), సిబాందా వెనుదిరిగారు. దాంతో జింబాబ్వే 15.1 ఓవర్లలో 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో చిగుంబురా, వాలర్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు వీరిద్దరు 80 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ దశలో మోహిత్ వాలర్‌ను అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అంతే...ఆ తర్వాత జింబాబ్వే కుప్పకూలింది. 17 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి ఐదు వికెట్లు కోల్పోయింది.
 
 అలవోకగా: ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చిన పుజారా (24 బంతుల్లో 13; 2 ఫోర్లు) ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. చటారా వేసిన బంతి అతని బ్యాట్ లోపలి అంచుకు తగిలి వికెట్లను నేలకూల్చింది. అయితే ఆ తర్వాత భారత బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం తడబడకుండా లక్ష్యం వైపు దూసుకుపోయారు. ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు మూడో స్థానంలో దిగిన రైనా కూడా అలవోకగా పరుగులు సాధించారు. 84 బంతుల్లో రోహిత్, 60 బంతుల్లో రైనా ఒకే ఓవర్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. లక్ష్యం చిన్నది కావడంతో దాదాపు 20 ఓవర్ల ముందే విజయం పూర్తయింది.
 
 స్కోరు వివరాలు
 జింబాబ్వే ఇన్నింగ్స్: సిబాందా (బి) జడేజా 24; సికందర్ (సి) కార్తీక్ (బి) మోహిత్ 7; మసకద్జా (రనౌట్) 10; టేలర్ (ఎల్బీడబ్ల్యు) జడేజా 0; విలియమ్స్ (బి) ఉనాద్కట్ 0; వాలర్ (సి) కార్తీక్ (బి) మోహిత్ 35; చిగుంబురా (నాటౌట్) 50; ఉత్సెయ (సి) రోహిత్ (బి) షమీ 1; చటారా (సి) జడేజా (బి) మిశ్రా 1; విటోరి (బి) మిశ్రా 8; చినౌయా (సి) కోహ్లి (బి) మిశ్రా 0; ఎక్స్‌ట్రాలు (బై 2, లెగ్‌బై 2, వైడ్ 4) 8; మొత్తం (42.4 ఓవర్లలో ఆలౌట్) 144.
 వికెట్ల పతనం: 1-16; 2-36; 3-44; 4-47; 5-47; 6-127; 7-130; 8-133; 9-143; 10-144.
 
 బౌలింగ్: మోహిత్ శర్మ 10-3-26-2; షమీ 8-1-34-1; ఉనాద్కట్ 7-0-27-1; జడేజా 9-1-28-2; మిశ్రా 8.4-0-25-3.
 
 భారత్ ఇన్నింగ్స్: పుజారా (బి) చటారా 13; రోహిత్ శర్మ (నాటౌట్) 64; రైనా (నాటౌట్) 65; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 1, వైడ్ 2) 3; మొత్తం (30.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 145.
 వికెట్ల పతనం: 1-23.
 
 బౌలింగ్: విటోరి 5.5-1-21-0; చినౌయా 4-0-14-0; చటారా 5-1-31-1; ఉత్సెయ 9-0-42-0; చిగుంబురా 2-0-12-0; విలియమ్స్ 4-0-21-0; వాలర్ 1-0-3-0.
 
 సమ్మోహితాస్త్రం
 దేశవాళీ పేస్ బౌలర్‌ను తీసుకునేందుకు మూడు ఐపీఎల్ జట్లు పోటీ పడటం అనూహ్య విషయం. అయితే అతని బౌలింగ్‌ను చూసిన చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ఆండీ బికెల్ మాత్రం ఆ కుర్రాడు తమకే కావాలని పట్టుబట్టాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ ఐపీఎల్‌లో సత్తా చాటిన ఆ ఆటగాడు 24 ఏళ్ల మోహిత్ శర్మ.
 
  హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన మోహిత్, ధోని అండతో ఐపీఎల్-6 లో చక్కటి ప్రదర్శన కనబర్చాడు. సాధారణ వేగమే అయినా చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో కచ్చితత్వంతో కూడిన బౌలింగ్ అతని బలం. నిలకడగా ఆఫ్ స్టంప్ బయట బంతులు విసరడంతో పాటు పదునైన అవుట్ స్వింగర్లతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు. దాంతోనే అతను సెహ్వాగ్, వార్నర్, యువరాజ్, మెక్‌కల్లమ్‌లాంటి స్టార్లను బోల్తా కొట్టించగలిగాడు. 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉన్న మోహిత్ బౌలింగ్ యాక్షన్‌ను బికెల్ మరింత తీర్చి దిద్దాడు.
 
  హర్యానా తరఫున  గత సీజన్ రంజీ ట్రోఫీలో  8 మ్యాచుల్లోనే 37 వికెట్లు పడగొట్టాడు. కుర్రాళ్లను ప్రోత్సహించడంలో ముందుండే ధోని, ఐపీఎల్‌లో మోహిత్‌కు 15 మ్యాచుల్లో అవకాశం కల్పించాడు. ఈ టోర్నీలో 20 వికెట్లు తీసిన అతను చెన్నై జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇదే ప్రదర్శన అతడిని జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యేలా చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన తొలి వన్డేలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో మోహిత్‌కూ చోటు దక్కింది.
 - సాక్షి క్రీడావిభాగం
 
 2 సందీప్ పాటిల్ (1980) తర్వాత తొలి వన్డేలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన రెండో భారత ఆటగాడు మోహిత్ శర్మ
 

మరిన్ని వార్తలు