తోబాల్‌లో భారత్ హవా

30 Nov, 2013 23:42 IST|Sakshi

భోలక్‌పూర్, న్యూస్‌లైన్: అంతర్జాతీయ త్రోబాల్ టోర్నమెంట్‌లో భారత్ హవా నడిచింది. ముషీరాబాద్ వాలీబాల్ ప్లేగ్రౌండ్స్‌లో  శ్రీలంకతో శనివారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. హైదరాబాద్ త్రోబాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీలో రెండు టెస్టుల్లోనూ భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఉదయం సెషన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 3-1తో గెలిచింది. ఆతిథ్య జట్టు జోరుకు 25-14, 26-27, 25-20, 25-14తో శ్రీలంక కంగుతింది.
 
 తొలి సెట్‌లో సునాయాసంగా గెలిచిన జట్టుకు రెండో సెట్‌లో ఓటమి ఎదురైంది. తదుపరి సెట్లతో ప్రత్యర్థి జట్టు నుంచి గట్టిపోటీ ఎదురైంది. సాయంత్రం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ భారత్ 3-1తో నెగ్గింది. 25-23, 25-12, 17-25, 25-15తో లంకపై గెలుపొందింది.
 
 
 మూడో సెట్ మినహా అన్ని సెట్లలోనూ భారత్ సునాయాసంగా గెలుపొందింది. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సికింద్రాబాద్  ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈవెంట్‌ను ఆరంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు రాణించి రాష్ట్రానికి దేశానికి పేరుప్రతిష్టలు తేవాలన్నారు. అంతర్జాతీయ టోర్నీల్లో రాణించిన ఆటగాళ్లకు ప్రభుత్వం తరఫున చక్కని ప్రోత్సాహకాలుంటాయని ఆయన అన్నారు.
 
 ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్ సరిత గోవింద్, భోలక్‌పూర్ కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్, టీఎఫ్‌ఐ సెక్రటరీ జనరల్ రామన్న, ఏపీ త్రోబాల్ అసోసియేషన్ కార్యదర్శి ప్రభుకుమార్, హైదరాబాద్ త్రోబాల్ సంఘం ఆర్గనైజింగ్ చైర్మన్ ఎస్‌కె.గుప్తా, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.బి.నర్సింహులు, ముషీరాబాద్ మండల ఉప విద్యాశాఖాధికారి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు