స్పిన్ ఉచ్చులో సఫారీలు చిత్తు

27 Nov, 2015 15:25 IST|Sakshi
స్పిన్ ఉచ్చులో సఫారీలు చిత్తు

నాగ్ పూర్: మరోసారి టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న సఫారీలు మూడో టెస్టులో ఓటమి పాలయ్యారు. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో సఫారీలు 124 పరుగుల తేడాతో పరాజయం చెంది సిరీస్ ను చేజార్చుకున్నారు. దీంతో టీమిండియా ఇంకా ఒక టెస్టు మిగిలి ఉండగానే సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.  దీంతో పాటు గత తొమ్మిదేళ్లుగా విదేశాల్లో టెస్టు సిరీస్ ఓడిపోని దక్షిణాఫ్రికా రికార్డు విజయాలకు ఫుల్ స్టాప్ పడింది.  టీమిండియా విసిరిన 310 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీలు చతికిలబడ్డారు. 32/2 ఓవర్ నైట్ స్కోరుతో  శుక్రవారం మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా 89.5 ఓవర్లలో185 పరుగులకే పరిమితమై ఓటమి చెందింది.


ఈ రోజు ఆటలో కెప్టెన్ హషీమ్ ఆమ్లా(39), డు ప్లెసిస్(39) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోవడంతో దక్షిణాఫ్రికాకు ఘోర ఓటమి తప్పలేదు. ఓ దశలో 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను కెప్టెన్ హషీమ్ ఆమ్లా- డు ప్లెసిస్ ల జోడి చక్కదిద్దింది.  వీరి జోడి ఐదో వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో దక్షిణాఫ్రికా తేరుకున్నట్లు కనిపించింది. కాగా, టీ విరామానికి కొద్ది ముందు ఈ జోడిని అమిత్ మిశ్రా పెవిలియన్ కు పంపి భారత్ విజయంపై ఆశలు రేకెత్తించాడు. ఇక అటు తరువాత  భారత స్పిన్ త్రయాన్ని ఎదుర్కోలేక వరుసగా క్యూకట్టారు. చివరి నాలుగు దక్షిణాఫ్రికా వికెట్లను 50 పరుగుల వ్యవధిలో సాధించిన భారత చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. భారత బౌలర్లలో అశ్విన్ మొత్తంగా 12 వికెట్లు సాధించి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ ఐదు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు సాధించాడు. అతనికి జతగా అమిత్ మిశ్రా రెండు ఇన్నింగ్స్ లలో కలిపి నాలుగు వికెట్లు తీశాడు. భారత్-దక్షిణాఫ్రికాల నాల్గో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 3వ తేదీన ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగనుంది.

 

టీమిండియా తొలి ఇన్నింగ్స్ 215 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 173 ఆలౌట్

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 79 ఆలౌట్,  రెండో ఇన్నింగ్స్  185 ఆలౌట్

మరిన్ని వార్తలు