పసిడి పోరుకు జ్యోతి సురేఖ జోడీ

26 Nov, 2019 02:57 IST|Sakshi

బ్యాంకాక్‌ (థాయ్‌లాండ్‌): ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–అభిషేక్‌ వర్మ (ఢిల్లీ) ద్వయం ఫైనల్‌కు చేరింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్‌ వర్మ జంట 159–154తో సో చేవన్‌–యాంగ్‌ జేవన్‌ (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన సురేఖ–అభిషేక్‌ క్వార్టర్‌ ఫైనల్లో 158–155తో ఆదెల్‌ జెన్‌బినోవా–అక్బర్‌ అలీ కరబయేవ్‌ (కజకిస్తాన్‌)లపై నెగ్గారు. బుధవారం జరిగే స్వర్ణ పతక పోరులో చెన్‌ యి సువాన్‌–చెన్‌ చెయి లున్‌ (చైనీస్‌ తైపీ)లతో సురేఖ–అభిషేక్‌ తలపడతారు.

దీపిక–అతాను దాస్‌ జంటకు కాంస్యం 
రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భార్యభర్తలైన దీపిక కుమారి–అతాను దాస్‌ జంట కాంస్య పతకం సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో దీపిక–అతాను దాస్‌ ద్వయం 6–2తో యిచాయ్‌ జెంగ్‌–వె షావోజువాన్‌ (చైనా) జోడీపై గెలిచింది. అంతకుముందు సెమీఫైనల్లో దీపిక–అతాను దాస్‌ 3–5తో లె చియెన్‌ యింగ్‌–సు యు యాంగ్‌ (చైనీస్‌ తైపీ)ల చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ)పై నిషేధం కొనసాగుతుండటంతో... ఈ టోర్నీలో భారత క్రీడాకారులు ప్రపంచ ఆర్చరీ పతాకం కింద పోటీపడుతున్నారు.

మరిన్ని వార్తలు