దీపక్‌ వెలుగులు

22 Sep, 2019 02:50 IST|Sakshi

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ చేరిన భారత రెజ్లర్‌

టోక్యో ఒలింపిక్స్‌కూ అర్హత

కాంస్యం రేసులో రాహుల్‌ అవారే  

గత నెలలో దీపక్‌ పూనియా జూనియర్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. జూనియర్‌ స్థాయి ఆటగాడు సీనియర్‌కు వచ్చేసరికి ఫలితాలు అంత సులువుగా రావనేది క్రీడా వర్గాల్లో ప్రచారం ఉన్న మాట. కానీ కేవలం నెల రోజుల వ్యవధిలోనే దానిని దీపక్‌ తప్పుగా నిరూపించాడు.ఆడుతున్న తొలి సీనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లోనే సత్తా చాటుతూ 86 కేజీల విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించి కనీసం రజతం ఖాయం చేసుకున్నాడు.

తుది పోరులోనూ ఇదే జోరు కొనసాగిస్తే సుశీల్‌ కుమార్‌ తర్వాత విశ్వవిజేతగా నిలిచిన రెండో భారత్‌ రెజ్లర్‌గా చరిత్రకెక్కుతాడు. 61 కేజీల విభాగం సెమీస్‌లో ఓడిన మరో భారత రెజ్లర్‌ రాహుల్‌ అవారే ఆదివారం కాంస్య పతక పోరులో బరిలోకి దిగుతాడు.  

నూర్‌–సుల్తాన్‌ (కజకిస్తాన్‌): ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ కెరటం దీపక్‌ పూనియా సత్తా చాటాడు. ఈ పోటీల 86 కేజీల విభాగంలో దీపక్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శనివారం ఏకపక్షంగా సాగిన సెమీస్‌ పోరులో 20 ఏళ్ల దీపక్‌ 8–2 తేడాతో స్టెఫాన్‌ రీచ్‌మత్‌ (స్విట్జర్లాండ్‌)ను చిత్తు చేశాడు. అంతకుముందు సెమీస్‌ చేరడంతోనే దీపక్‌ వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో ఇరాన్‌కు చెందిన హసన్‌ యజ్దానీచరాతితో దీపక్‌ తలపడతాడు.   

పోటీ లేకుండా...
మూడేళ్ల క్రితం తొలిసారి వరల్డ్‌ క్యాడెట్‌ టైటిల్‌ గెలుచుకొని వెలుగులోకి వచి్చన దీపక్‌ ఆ తర్వాత నిలకడగా విజయాలు సాధించాడు. గత నెలలో జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌గా నిలవడంతో అతనిపై అంచనాలు పెరిగాయి. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో అతనికి ప్రత్యర్థి నుంచి ఎలాంటి పోటీ ఎదురు కాలేదు. తొలి పీరియడ్‌లో 1–0తో ముందంజ వేసిన దీపక్‌ రెండో పీరియడ్‌లో ప్రత్యరి్థని పడగొట్టి 4–0తో దూసుకుపోయాడు. ఆ తర్వాత రెండు పాయింట్లు కోల్పోయినా... మరోసారి రీచ్‌మత్‌పై సంపూర్ణ ఆధిక్యం కనబర్చి 8–2తో బౌట్‌ను ముగించాడు. సుశీల్‌ 2010లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత మరే భారత రెజ్లర్‌ ఈ ఘనతను అందుకోలేదు. ఇప్పుడు దీపక్‌ దానికి విజయం దూరంలో నిలిచాడు. అంతకుముందు హోరాహోరీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో దీపక్‌ 7–6తో కార్లోస్‌ మెండెజ్‌ (కొలంబియా)ను ఓడించి ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు.  

►4 దీపక్‌ ఫైనల్‌ చేరడంతో భారత్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసినట్లయింది. 2013లో భారత్‌కు అత్యధికంగా మూడు పతకాలు రాగా... ఈసారి నాలుగు ఖాయమయ్యాయి. ఒకవేళ నేటి  బౌట్‌లో రాహుల్‌ కూడా గెలిస్తే భారత్‌ ఖాతాలో ఐదు పతకాలు చేరుతాయి.   

►5 ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో ఫైనల్‌కు అర్హత పొందిన ఐదో భారత రెజ్లర్‌ దీపక్‌ పూనియా. గతంలో బిషంబర్‌ సింగ్‌ (1967లో), సుశీల్‌ కుమార్‌ (2010లో), అమిత్‌ దహియా (2013లో), బజరంగ్‌ (2018లో) ఈ ఘనత సాధించారు. ఈ నలుగురిలో సుశీల్‌ ఫైనల్లో నెగ్గి స్వర్ణం సాధించగా... మిగతా ముగ్గురు రజతం దక్కించుకున్నారు.

రాహుల్‌కు నిరాశ
61 కేజీల నాన్‌ ఒలింపిక్‌ కేటగిరీలో భారత రెజ్లర్‌ రాహుల్‌ అవారే సెమీస్‌లో ఓటమి పాలయ్యాడు. బెకా లోమ్‌టాదె (జార్జియా) 10–6 స్కోరుతో రాహుల్‌పై గెలిచాడు. నేడు జరిగే కాంస్యపతక పోరులో టైలర్‌ గ్రాఫ్‌ (అమెరికా) లేదా మిహై ఇసాను (మాల్డొవా) లతో రాహుల్‌ తలపడతాడు. ఇతర భారత రెజ్లర్లలో జితేందర్‌ (79 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లో, మౌసమ్‌ ఖత్రీ (97 కేజీలు) తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా