భారత అథ్లెట్‌ గోమతిపై నాలుగేళ్ల నిషేధం

9 Jun, 2020 00:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ స్వర్ణ పతక విజేత గోమతి మరిముత్తు డోపీగా తేలింది. దీంతో ఆమెపై నాలుగేళ్ల నిషేధాన్ని విధించినట్లు సోమవారం వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ప్రకటించింది. తమిళనాడుకు చెందిన గోమతి నుంచి సేకరించిన నాలుగు నమూనాల్లోనూ నిషేధిత ఉత్ప్రేరకం ‘19 నార్‌ ఆండ్రోస్టెరోన్‌’ స్టెరాయిడ్‌ ఆనవాళ్లు ఉండటంతో... అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ (ఏఐయూ) నాలుగేళ్ల సస్పెన్షన్‌ వేటు వేసింది.  2019 మే 17 నుంచి 2023 మే 16 వరకు ఆమెపై ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఏఐయూ పేర్కొంది.

2019 దోహా ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ 800 మీటర్ల పరుగును తన అత్యుత్తమ టైమింగ్‌తో (2ని: 2.70 సెకన్లు) పూర్తిచేసిన గోమతి విజేతగా నిలిచింది. ఈ క్రీడల సెలక్షన్స్‌ సందర్భంగా గతేడాది ఏప్రిల్‌లో, ఫెడరేషన్‌ కప్‌ సందర్భంగా పాటియాలాలో గోమతి నుంచి శాంపిల్స్‌ సేకరించారు. ఇవి పాజిటివ్‌గా రావడంతో ఆమె ఆసియా చాంపియన్‌షిప్‌లో సాధించిన పసిడి పతకాన్ని కూడా ఆమె కోల్పోనుంది. దీంతో పాటు ఆమె ఏఐయూకు లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే జాతీయ డోపింగ్‌ టెస్టు ల్యాబ్‌ (ఎన్‌డీటీఎల్‌)లో పరీక్షించిన తన నమూనాల పరిమాణంపై ఆమె సందేహాలు వ్యక్తం చేసింది. కానీ ఇవేవీ ఆమెను శిక్ష నుంచి తప్పించలేకపోయాయి.

మరిన్ని వార్తలు