ఎదురులేని సింధు 

15 Dec, 2018 00:49 IST|Sakshi

లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన భారత స్టార్‌

పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌ చేరిన సమీర్‌ వర్మ 

గ్వాంగ్‌జౌ (చైనా): సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు తన జోరు కొనసాగిస్తోంది. వరుసగా మూడు విజయాలు సాధించి సెమీఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న సింధు లీగ్‌ దశను అజేయంగా ముగించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో సింధు 21–9, 21–15తో ప్రపంచ 12వ ర్యాంకర్‌ బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)పై గెలుపొందింది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా తై జు యింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అకానె యామగుచి 21–18, 11–12తో గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గాయం కారణంగా తై జు యింగ్‌ రెండో గేమ్‌ మధ్యలో వైదొలగడంతో యామగుచిని విజేతగా ప్రకటించారు.

నేడు జరిగే సెమీఫైనల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్‌ ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు; నొజోమి ఒకుహారా (జపాన్‌)తో అకానె యామగుచి తలపడతారు.   పురుషుల సింగిల్స్‌లో భారత యువతార సమీర్‌ వర్మ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గ్రూప్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో సమీర్‌ వర్మ 21–9, 21–18తో కాంతపోన్‌ వాంగ్‌చరోయెన్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గాడు. ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ కెంటో మొమోటా (జపాన్‌) 21–14, 21–8తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచి గ్రూప్‌ టాపర్‌గా నిలిచాడు. రెండు విజయాలు సాధించిన సమీర్‌ వర్మ రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కించుకున్నాడు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో షి యుకి (చైనా)తో సమీర్‌ వర్మ; సన్‌ వాన్‌ హో (దక్షిణ కొరియా)తో కెంటో మొమోటా ఆడతారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా