అమిత్‌ నంబర్‌వన్‌

7 Jul, 2020 00:55 IST|Sakshi
భారత బాక్సర్‌ అమిత్‌ పంఘాల్

ప్రపంచ బాక్సింగ్‌ ర్యాంకింగ్స్‌

న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో రజత పతకం నెగ్గిన ఏకైక భారత బాక్సర్‌గా గుర్తింపు పొందిన అమిత్‌ పంఘాల్‌ మరో ఘనత సాధించాడు. సోమవారం విడుదల చేసిన అంతర్జాతీయ అమెచ్యూర్‌ బాక్సింగ్‌ సంఘం (ఏఐబీఏ–ఐబా) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అమిత్‌ పురుషుల 52 కేజీల విభాగంలో నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. జకార్తా–2018 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన ఈ హరియాణా బాక్సర్‌ ఖాతాలో 1300 పాయింట్లు ఉన్నాయి.

అమిత్‌ చిరకాల ప్రత్యర్థి ప్రస్తుత ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌ జైరోవ్‌ షకోబిదిన్‌ (ఉజ్బెకిస్తాన్‌) 1200 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోగా... అసెనోవ్‌ పనేవ్‌ (బల్గేరియా) 1000 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. రోహతక్‌కు చెందిన 24 ఏళ్ల అమిత్‌ రెండేళ్లుగా భారత స్టార్‌ బాక్సర్‌గా రూపాంతరం చెందాడు. అతను 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం, ఆసియా క్రీడల్లో స్వర్ణం, ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించాడు. ఆర్థిక అవకతవకల కారణంగా గతేడాది ‘ఐబా’పై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సస్పెన్షన్‌ విధించింది.

అనంతరం ఐఓసీ ప్రపంచ బాక్సింగ్‌ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు బాక్సింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. బాక్సింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ అమిత్‌ నంబర్‌వన్‌గా నిలిచాడు. తాజాగా ‘ఐబా’ ప్రకటించిన అధికారిక ర్యాంకింగ్స్‌లోనూ అమిత్‌ ‘టాప్‌’లో నిలువడం విశేషం. మొత్తం తొమ్మిది వెయిట్‌ కేటగిరీలకుగాను నాలుగింటిలో భారత బాక్సర్లు టాప్‌–10లో ఉన్నారు. దీపక్‌ (49 కేజీలు) ఆరో ర్యాంక్‌లో, కవీందర్‌ బిష్త్‌ (56 కేజీలు) నాలుగో ర్యాంక్‌లో, మనీశ్‌ కౌశిక్‌ (64 కేజీలు) ఆరో ర్యాంక్‌లో నిలిచారు. గత ఏడాది జనవరిలో ‘ఐబా’ ప్రకటించిన ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంక్‌లో ఉన్న భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ (51 కేజీలు) తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయింది. ఇదే విభాగంలో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ 21వ ర్యాంక్‌లో నిలిచింది.
 

మరిన్ని వార్తలు