పసిడి కోసం వికాస్, సిమ్రన్‌ పోరు

11 Mar, 2020 00:41 IST|Sakshi

ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఫైనల్‌ చేరిన భారత బాక్సర్లు

సెమీస్‌లో ఓడి కాంస్యాలు నెగ్గిన

అమిత్, ఆశిష్, సతీశ్, మేరీకోమ్, పూజా రాణి, లవ్లీనా

అమ్మాన్‌ (జోర్డాన్‌): టోక్యో ఒలింపిక్స్‌ ఆసియా క్వాలిఫయింగ్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో ఇద్దరు భారత బాక్సర్లు ఫైనల్‌ చేరగా... మరో ఆరుగురు సెమీస్‌లో ఓడి కాంస్య పతకాలతో ముగించారు. పురుషుల 69 కేజీల విభాగంలో వికాస్‌ కృషన్‌... మహిళల 60 కేజీల విభాగంలో సిమ్రన్‌జిత్‌ కౌర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీస్‌లో వికాస్‌ 3–2 తేడాతో ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత అబ్‌లైఖన్‌ జుసుపొవ్‌ (కజకిస్తాన్‌)పై విజయం సాధించాడు. బౌట్‌లో ఎడమ కంటి దిగువభాగంలో గాయమైనా... పట్టుదల ప్రదర్శించిన వికాస్‌ తుది పోరుకు అర్హత సాధించాడు. ఫైనల్లో అతను ఈషా హుస్సేన్‌ (జోర్డాన్‌)తో తలపడతాడు. ఒకవేళ వికాస్‌ కంటి గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే అతనికి ఫైనల్లో పోటీపడే అవకాశం ఇవ్వరు. సిమ్రన్‌జిత్‌కు సెమీస్‌లో విజయం సులువుగానే దక్కింది. సిమ్రన్‌జిత్‌ 4–1తో ఆసియా చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత షి యి వు (చైనీస్‌ తైపీ)ని ఓడించింది. ఫైనల్లో సిమ్రన్‌ రెండుసార్లు ఆసియా విజేతగా నిలిచిన ఓ యెన్‌ జీ (దక్షిణ కొరియా)ను ఎదుర్కొంటుంది.

పురుషుల విభాగంలో అమిత్‌ పంఘాల్‌ (52 కేజీలు), ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు), సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు)... మహిళల విభాగంలో మేరీకోమ్‌ (51 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్‌ (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) సెమీస్‌లో ఓటమి పాలయ్యారు. అమిత్‌ 2–3తో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత జియాంగ్వాన్‌ హు (చైనా) చేతిలో, ఆశిష్‌ 1–4తో మార్సియల్‌ ఇముర్‌ (ఫిలిప్పీన్‌) చేతిలో... సతీశ్‌ 0–5తో బఖోదిర్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో... మేరీకోమ్‌ 2–3తో యువాన్‌ చాంగ్‌ (చైనా) చేతిలో, లవ్లీనా 0–5తో హోంగ్‌ గు (చైనా) చేతిలో, పూజ రాణి 0–5తో ఖియాన్‌ లి (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ టోర్నీ ద్వారా ఇప్పటికే ఎమిమిది మంది భారత బాక్సర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. పురుషుల 81 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ సచిన్‌ కుమార్‌ ఫైనల్‌ బాక్స్‌ ఆఫ్‌ బౌట్‌కు అర్హత సాధించాడు. నేడు జరిగే ఫైనల్‌ బాక్స్‌ ఆఫ్‌ బౌట్‌లో షబ్బోస్‌ నెగ్‌మతులోయెవ్‌ (తజికిస్తాన్‌)పై సచిన్‌ గెలిస్తే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందుతాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా