‘రింగ్’ నుంచి రిక్తహస్తాలతో...

24 Oct, 2013 01:32 IST|Sakshi
‘రింగ్’ నుంచి రిక్తహస్తాలతో...

అల్మాటీ (కజకిస్థాన్): వరుసగా మూడోసారి ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేస్తారనుకున్న భారత బాక్సర్లు నిరాశపరిచారు.
 
 బుధవారం ఇక్కడ జరిగిన పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్ బరిలో నిలిచిన ఐదుగురు భారత బాక్సర్లు శివ థాపా, మనోజ్ కుమార్, వికాస్ మలిక్, సుమీత్ సంగ్వాన్, సతీశ్ కుమార్ ఓడిపోయారు. ఫలితంగా ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్ నుంచి భారత బాక్సర్లు రిక్తహస్తాలతో తిరిగి వస్తున్నారు. 2009లో విజేందర్, 2011లో వికాస్ కృషన్ భారత్‌కు కాంస్య పతకాలను అందించారు. తొలిసారి ఈ మెగా ఈవెంట్‌లో ఒకేసారి భారత్ నుంచి ఐదుగురు భారత బాక్సర్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నా ఒక్కరు కూడా ఈ అడ్డంకిని అధిగమించలేకపోయారు. ఒకవేళ క్వార్టర్ ఫైనల్స్‌లో గెలిచిఉంటే కనీసం కాంస్య పతకం ఖాయవయ్యేది.
 
 
  56 కేజీల విభాగంలో నాలుగో సీడ్ శివ థాపా 0-3 (27-30, 27-30, 27-30)తో జావిద్ చలాబియేవ్ (అజర్‌బైజాన్) చేతిలో... 60 కేజీల విభాగంలో వికాస్ మలిక్ 0-3 (28-29, 25-30, 27-30)తో నాలుగో సీడ్ రాబ్సన్ కాన్సికావో (బ్రెజిల్) చేతిలో ఓడిపోయారు. 64 కేజీల విభాగంలో ఆరో సీడ్ మనోజ్ కుమార్ 0-3 (27-30, 28-29, 26-30)తో యాస్నియెర్ లోపెజ్ (క్యూబా) చేతిలో... 81 కేజీల విభాగంలో సుమీత్ సంగ్వాన్ 0-3 (27-30, 28-29, 27-30)తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఆదిల్‌బెక్ నియాజిమ్‌బెతోవ్ (కజకిస్థాన్) చేతిలో ఓటమి చవిచూశారు. ప్లస్ 91 కేజీ విభాగంలో గాయం కారణంగా సతీశ్ కుమార్ బరిలోకి దిగకుండా తన ప్రత్యర్థి ఇవాన్ దిచ్కో (కజకిస్థాన్)కు ‘వాకోవర్’ ఇచ్చాడు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా