కంబాల రేసర్‌కు సాయ్‌ పిలుపు!

15 Feb, 2020 13:26 IST|Sakshi

బెంగుళూరు: అంతర్జాతీయంగా ఫీల్డ్‌ అండ్‌ ట్రాక్‌ అథ్లెటిక్స్‌లో ఇప్పటికే  తనదైన ముద్రతో దూసుకుపోతున్న భారత్‌కు మరో ఉసేన్‌ బోల్డ్‌ దొరికాడా అంటే అవుననే చెప్పాలేమో. ఉసేన్‌ బోల్డ్‌ను మించిన వేగంతో దూసుకొచ్చిన కర్ణాటకకు చెందిన 28 ఏళ్ల శ్రీనివాస గౌడ ఇప్పుడు యావత్‌ భారతావనిని ఆకర్షించాడు. అది ఇప్పుడు  కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు చెంతకు చేరింది. దాంతో శ్రీనివాస గౌడకు సాయ్‌ నుంచి ఆహ్వానం పంపుతామని ఆయన స్పష్టం చేశారు. తానే స్వయంగా శ్రీనివాస గౌడకు కాల్‌ చేసి సాయ్‌ నిర్వహించే ట్రయల్‌కు రమ్మని పిలుస్తానని పేర్కొన్నారు.

‘నేను శ్రీనివాస గౌడను సాయ్‌ ట్రయల్స్‌కు రమ్మని పిలుస్తా. చాలామందికి ఒలింపిక్స్‌ స్టాండర్స్‌ గురించి సరైన అవగాహన ఉండటం లేదు.  ప్రత్యేకంగా అథ్లెటిక్స్‌లో శరీర ధృడత్వంతో పాటు ఓర్పు కూడా అవసరం.  దాంతోనే ఎన్నో ఘనతలు సాధ్యం. భారత్‌లో టాలెంట్‌ అనేది నిరూపయోగంగా ఉండకూడదు’ అని కిరణ్‌ రిజుజు అన్నారు.

ప్రధానంగా మంగుళూరు, ఉడిపి ప్రాంతాల్లో నిర్వహించే సంప్రదాయ ‘కంబాల’క్రీడలో శ్రీనివాస గౌడ ముప్పయ్‌ ఏళ్ల రికార్డును తిరగరాశాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిద్రికి చెందిన ఈ రేసర్‌ 13.62 సెకండ్లలో 142.50 మీటర్లు పరుగెత్తి.. ఉసేన్‌ బోల్ట్‌ (9.58 సెకండ్లలో 100 మీటర్లు) ప్రపంచ రికార్డును గుర్తు చేశాడు. 142.50 మీటర్ల దూరాన్ని 100 మీటర్లకు లెక్కించినపుడు.. కన్నడ యువకుడు ‘జైమైకా చిరుత’ కన్నా 0.03 సెకండ్లు ముందంజలో ఉండటం విశేషం. రెండు దున్నపోతులతో పాటు పరుగెత్తే ఈ క్రీడను బురదమయమైన పంట పొలాల్లో నిర్వహిస్తారు. ఇక శ్రీనివాస గౌడ బోల్ట్‌ కన్నా వేగంగా పరెగెత్తుతున్నాడని సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. (ఇక్కడ చదవండి: ఏమి ఆ వేగం.. బోల్ట్‌ను మించి పోయాడు..!)

మరిన్ని వార్తలు