డుప్లెసిస్‌ వ్యాఖ్యలపై క్రికెట్‌ అభిమానుల ఫైర్‌

27 Oct, 2019 16:59 IST|Sakshi

న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌పై భారత క్రికెట్‌ అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు. అద్భుతమైన ఆటతో సౌతాఫ్రికాను మట్టి కరిపించిన టీమిండియా మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. భారీ స్కోర్లు నమోదు చేసిన మన ఆటగాళ్లు ప్రత్యర్థికి చెమటలు పట్టించారు. వారికి తోడు బౌలర్లు తలోచేయి వేయడంతో సఫారీ జట్టు ఏ మ్యాచ్‌లోనూ తేరుకోలేకపోయింది. అయితే, టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనను కించపరుస్తూ డుప్లెసిస్‌ వ్యాఖ్యలు చేశాడు. టాస్‌ కలిసిరావడం వల్లే భారత బ్యాట్స్‌మెన్‌ భారీగా పరుగులు చేయగలిగారని.. వరుసగా టాస్ ఓడిపోవడం మా కొంపముంచిందని అన్నాడు. అంతటితో ఆగకుండా.. ప్రతిమ్యాచ్‌ కాపీ, పేస్ట్‌లా సాగిందని చులకనగా మాట్లాడాడు.
(చదవండి : అసలు మీరు ఆడితేనే కదా?: స్మిత్‌ చురకలు)

‘ప్రతి మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచేది. తొలుత బ్యాటింగ్‌ చేపట్టి 500 పైచిలుకు పరుగులు సాధించేది. చీకటి పడుతుందగా ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసేది. అదే చీకట్లో మమ్మల్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించి మూడు వికెట్లు పడగొట్టేది. ప్రతి మ్యాచ్‌లో ఇదే తంతు. అంతా కాపీ, పేస్ట్‌లా సాగిపోయింది’అని ఓ స్పోర్ట్స్‌ చానెల్‌లో వ్యాఖ్యానించాడు. ఇక డుప్లెసిస్‌ వ్యాఖ్యలపై భారత క్రికెట్‌ ఫ్యాన్స్‌ ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘ఇలాంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తి జట్టుకు కెప్టెన్‌గా ఉంటే దక్షిణాఫ్రికా ఎప్పటికీ తేరుకోలేదని ఒకరు చురకలంటించారు.

‘డుప్లెసిస్‌ మాటలు చాలా కోపం తెప్పించేవిగా ఉన్నాయి. అతన్ని బండబూతులు తిట్టాలనుంది. కానీ, సీఎస్‌కే ఆటగాడు కదా అని వదిలేస్తున్నా’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘డుప్లెసిస్ చెప్పే సాకులు భయంకరంగా ఉన్నాయి. పోనీలే అతన్ని వదిలేద్దాం అనుకుంటే పొరబాటే. అతను మారడు. మళ్లీ అలానే చేస్తాడు. అందుకే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుందాం’ అని మరో అభిమాని రాసుకొచ్చాడు. ‘చిన్నపిల్లల మనస్తత్వం. కాపీ పేస్ట్‌లా మ్యాచ్‌లు సాగాయట. అతని మాటలు విని పగలబడి నవ్వుకున్నా’అని మరో వ్యక్తి కామెంట్‌ చేశాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా