పరిస్థితుల్ని బట్టి కూర్పు 

1 Oct, 2019 03:43 IST|Sakshi
రహానే, షమీ

దక్షిణాఫ్రికాను తేలిగ్గా తీసుకోం  

వైస్‌ కెప్టెన్‌ రహానే వ్యాఖ్య

సాక్షి, విశాఖపట్నం: సొంతగడ్డపై భారత్‌కు మంచి రికార్డు ఉన్నప్పటికీ... దక్షిణాఫ్రికాను ఏమాత్రం తేలిగ్గా తీసుకోబోమని భారత టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే అన్నాడు. పరిస్థితుల్ని బట్టి తుది జట్టు కూర్పు ఉంటుందని చెప్పాడు. బ్యాటింగ్‌లో నిలకడ ప్రదర్శిస్తున్న ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారి... స్పిన్నర్‌గానూ అక్కరకు వస్తున్నాడని తెలిపాడు. కొంతకాలంగా ఫామ్‌లేమితో ఒత్తిడిలో కూరుకుపోయిన రహానే ఇటీవల వెస్టిండీస్‌ పర్యటనలో సెంచరీతో టచ్‌లోకి వచ్చాడు. తొలి టెస్టులో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 81, 102 పరుగులు చేసి సత్తా చాటుకున్నాడు. దీనిపై అతను మాట్లాడుతూ ‘ప్రతీ మ్యాచ్‌ పాఠమే. ప్రతీ సిరీస్‌ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి. అలాగే సెంచరీ కోసం రెండు ఏళ్లుగా ఎదురుచూశాను. 17 టెస్టుల తర్వాత  వెస్టిండీస్‌లో సాధించా. చూస్తుంటే ఈ 17 అంకెతో నాకు ఏదో బంధముందనిపిస్తోంది. నా కెరీర్‌లో తొలి శతకం కోసం 17 టెస్టులు ఆడాను.

ఇప్పుడు ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న నేను మళ్లీ 17 టెస్టుల తర్వాతే మరో సెంచరీ చేశా’నన్నాడు. సెంచరీ కోసం పరితపించినపుడు అది సాకారం కాలేదని... కానీ విండీస్‌లో ఆ ఆలోచన లేకపోయినా సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. త్వరలో తండ్రి కాబోతున్న రహానే ‘ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది. సెంచరీ చేయాలని రాసి ఉంటే సాధించడం జరుగుతుంది’ అని అన్నాడు. పరుగుల కోసం, భారీ ఇన్నింగ్స్‌లు సాధించడం కోసం పూర్తిగా టెక్నిక్‌పైనే ఆధారపడటం లేదని చెప్పాడు. ‘మాటలు చెప్పినంత సులువు కాదు టెక్నిక్‌ మార్చడం. నా వరకైతే నేను నా సామర్థ్యాన్నే నమ్ముతాను. టెక్నిక్‌ను కాదు.

ముఖ్యంగా క్లిష్టమైన పరిస్థితుల్లో మానసిక సమతౌల్యాన్ని పాటిస్తా’నని తెలిపాడు. దిగ్గజాలు డివిలియర్స్, డేల్‌ స్టెయిన్‌ లేకపోయినా... దక్షిణాఫ్రికా మేటి జట్టేనని, పైగా ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమైన ప్రతీ సిరీస్‌ కీలకమేనని చెప్పాడు. ముందుగా దక్షిణాఫ్రికాతో మూడు, బంగ్లాతో రెండు టెస్టులు మొత్తం స్వదేశంలో ఆడే ఈ ఐదు మ్యాచ్‌ల్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పాడు. సఫారీ ప్రస్తుత జట్టులో మార్క్‌రమ్, బవుమా, డుప్లెసిస్‌ సత్తాగల ఆటగాళ్లని కితాబిచ్చాడు.   

మరిన్ని వార్తలు