కేరళ వరదలు: 15 లక్షల సాయం ప్రకటించిన క్రికెటర్‌

18 Aug, 2018 12:57 IST|Sakshi
సంజూ శాంసన్‌

తిరవనంతపురం : కేరళ వరద బాధితుల కోసం క్రీడాలోకం సైతం ముందుకు కదిలింది. కొందరు ఆటగాళ్లు విరాళాలు ప్రకటిస్తుండగా.. మరికొందరు బాధితులకు అండగా ఉండాలని సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. ఐపీఎల్‌ స్టార్‌, భారత క్రికెటర్‌ సంజూ శాంసన్‌ రూ.15 లక్షల ఆర్ధిక సాయాన్నిప్రకటించాడు.  అతని తరపున తన తండ్రి , సోదరుడు సీఎం పినరయి విజయన్‌ను కలిసి చెక్‌ అందజేశారు.

దీనిపై ఓ ఇంటర్వ్యూలో శాంసన్‌ స్పందిస్తూ.. ‘పబ్లిసిటీ కోసం చేయలేదు. వరదల వల్ల నష్టపోయినవారికి సాయం అందుతుందని, నాలా ఇతరులు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తారని ఇలా చేశాను. నాకు పబ్లిసిటీ అవసరేం లేదు. నేను చేసిన పని ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సహాయ నిధికి విరాళాలు ఇచ్చేదానిపై అవగాహన కల్సించాల్సిన అవసరం ఎంతో ఉంది. చాలా మంది వారికి తోచి సాయం చేస్తున్నారు.’ అని శాంసన్‌ చెప్పుకొచ్చాడు. గత సీజన్‌ ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సైతం కేరళ వరదలపై ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ‘కేరళలో పరిస్థితి మెరుగుపడాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న భారత ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ల సేవలకు హ్యాట్సాఫ్‌’ అంటూ కొనియాడాడు. హార్దిక్‌ పాండ్యా సైతం ప్రతి ఒక్కరు కేరళ ప్రజలకు తోచిన సాయం చేస్తూ అండగా నిలవాలని పిలుపునిచ్చాడు. భారత ఫుట్‌ బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ చెత్రీ సైతం సాయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.

మరిన్ని వార్తలు