పాక్‌ కెప్టెన్‌కు భారత ఫ్యాన్స్‌ మద్దతు

31 May, 2019 09:45 IST|Sakshi

లండన్‌ : క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మెగా టోర్నీ ప్రపంచ కప్‌ 2019 గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే టోర్నీ ఆరంభానికి ముందు ఆతిథ్య ఇంగ్లండ్‌ బుధవారం ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్‌ పది జట్ల కెప్టెన్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్వీన్‌ ఎలిజబెత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ జట్టు కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ వస్త్రధారణ సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. మిగతా కెప్టెన్లంతా ఫార్మల్‌ డ్రెస్సుల్లో రాగా సర్ఫరాజ్‌ మాత్రం సంప్రదాయ దుస్తులు ధరించాడు. కుర్తా, పైజామాలతో పాటు టీమ్‌ బ్లేజర్‌ వేసుకుని అందరిలోనూ ప్రత్యేకంగా నిలిచాడు.

ఈ నేపథ్యంలో..‘ అన్ని జట్ల కెప్టెన్లు టై, జాకెట్‌ ధరించి ఎంతో హుందాగా వచ్చారు. కానీ పాకిస్తానీ మాత్రం అందరికీ భిన్నంగా దర్శనమిచ్చాడు. ఇంకా నయం లుంగీ, బనియన్‌, టోపీ పెట్టుకుని రాలేదు. ఒకవేళ అలా గనుక వచ్చి ఉంటే!!’ అంటూ పాకిస్తానీ రచయిత తమ టీమ్‌ కెప్టెన్‌ను అవమానించే రీతిలో కామెంట్‌ చేశాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్‌కు పాకిస్తాన్‌తో పాటు భారత జట్టు అభిమానులు అండగా నిలిచారు. ఎక్కడికి వెళ్లినా మూలాలు మరచిపోలేదని పాక్‌ అభిమానులు అభినందించగా... మరికొంత మంది మాత్రం సర్ఫరాజ్‌కు ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు అంటూ ట్రోల్‌ చేశారు.

దీంతో.. రంగంలోకి దిగిన టీమిండియా ఫ్యాన్స్‌.. ‘సర్ఫరాజ్‌ను విమర్శించడంలో అర్థంలేదు. నిజానికి కోహ్లి కూడా సంప్రదాయ దుస్తులు ధరించాల్సింది. అయినా ఆటగాడి ప్రతిభను చూడాలి అతడి వస్త్రధారణను కాదు. ఒకవేళ రాణీగారు భారత్‌ వచ్చినపుడు చీర కట్టుకుంటారా. ప్రధాని మోదీని కలిసినపుడు విదేశీ నేతలు మనలా తయారవుతారా? బ్రిటన్‌ రాజును కలిసినపుడు గాంధీజీ ధోతి కట్టుకున్న విషయం మరచిపోయారా? సర్ఫరాజ్‌ చేసిన దాంట్లో తప్పేమీలేదు. అనవసరంగా అతడి మీద పడి ఏడవకండి’ అంటూ పాక్‌ కెప్టెన్‌కు అండగా నిలిచారు.

కాగా ప్రపంచ కప్‌ తొలి పోరులో ఆతిథ్య ఇంగ్లండ్‌ 104 పరుగులతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగి భారీ స్కోరు సాధించిన ఇంగ్లండ్‌... ఆ తర్వాత పదునైన బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్‌లతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఈసారి ఫేవరెట్‌ కాదు కాబట్టి మాపై ఒత్తిడి లేదంటూ బరిలోకి దిగిన సఫారీలు అన్ని రంగాల్లో విఫలమైన భారీ ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన బెన్‌ స్టోక్స్, భీకరమైన బంతులతో ప్రత్యర్థి పని పట్టిన పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ హీరోలుగా నిలిచారు.

మరిన్ని వార్తలు