నీ బ్యాట్‌ సరే.. అందులో స్ప్రింగ్‌ ఏది?

23 Mar, 2020 16:15 IST|Sakshi

మెల్‌బోర్న్‌: 2011 వన్డే వరల్డ్‌కప్‌ను రెండోసారి సాధించడానికి ముందు టీమిండియా కేవలం రెండుసార్లు మాత్రమే ఆ మెగా టోర్నీలో ఫైనల్‌కు చేరింది.  అందులో 1983 వరల్డ్‌కప్‌ను భారత్‌ సాధిస్తే, 2003 వరల్డ్‌కప్‌లో మాత్రం రనరప్‌గా సరిపెట్టుకుంది. సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా 17 ఏళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరినా ట్రోఫీని కైవసం చేసుకోలేకపోయింది. ఆనాటి ఫైనల్లో ఆసీస్‌ చేతిలో భారత్‌ 125 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాగా, రికీ పాంటింగ్‌ నేతృత్వంలోని ఆసీస్‌ మాత్రం ఆ మెగాఫైట్‌లో రెచ్చిపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 50 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసి రికార్డు స్కోరును భారత్‌ ముందుంచింది. అందులో పాంటింగ్‌(140 నాటౌట్‌) భారీ సెంచరీకి తోడు గిల్‌ క్రిస్ట్‌(57), మాథ్యూ హేడెన్‌(37), డామియన్‌ మార్టిన్‌(88 నాటౌట్‌)లు రాణించడంతో ఆసీస్‌ మూడొందల యాభైకి పైగా పరుగుల్ని అవలీలగా చేసింది. (ఇది భరించలేని చెత్త వైరస్‌)

అయితే ఆ ఫైనల్‌ మ్యాచ్‌కు ఎన్నో ఏళ్ల ముందు నుంచే పలువురు క్రికెటర్లు భిన్నమైన బ్యాట్‌లు వాడుతున్నారనే విమర్శలు వినిపిస్తూ వచ్చాయి. కొంతమంది బ్యాట్లలో రాడ్లు వాడుతుండగా, మరికొంతమంది బ్యాట్‌ హ్యాండిల్‌ గ్రిప్‌ లోపల స్ప్రింగ్‌లు వాడుతున్నారనే దుమారం బాగా వినిపించేది. ఇప్పుడు మరొకసారి ఆ సెగ పాంటింగ్‌కు తాకింది. అదేంటి పాంటింగ్‌ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి చాలాకాలమే అయ్యింది కదా.. ఇప్పుడు అతని బ్యాట్‌లో స్ప్రింగ్‌లు ప్రస్తావన ఎంటి అనుకుంటున్నారా. తాజాగా 2003 వరల్డ్‌కప్‌లో ఫైనల్లో వాడిన బ్యాట్‌ను పాంటింగ్‌ ట్వీటర్‌లో పోస్ట్‌ చేయడమే మళ్లీ అప్పటి స్ప్రింగ్‌ల మాట తెరపైకి వచ్చింది. (‘దొంగ నిల్వలు పెట్టుకోవద్దు’)

‘ఇప్పుడు మనమంతా ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నాం. మనకు తగినంత సమయం లభించింది. నేను రెగ్యులర్‌గా కొన్ని విషయాలను అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఉంటాను. ఆ క్రమంలోనే 2003 వరల్డ్‌కప్‌లో నేను వాడిన బ్యాట్‌ను షేర్‌ చేసుకుంటున్నా’ అని పాంటింగ్‌ పోస్ట్‌ పెట్టాడు. దీనిలో భాగంగా ఆనాటి బ్యాట్‌ను రెండు వైపులకు తిప్పిమరీ ఫొటోలు పెట్టాడు. ఈ విషయంలో పాంటింగ్‌పై ట్రోలింగ్‌కు దిగారు భారత అభిమానులు. ‘ నీ బ్యాట్‌ హ్యాండిల్‌కు ఉన్న గ్రిప్‌ తీస్తే స్ప్రింగ్‌ ఉంటుంది కదా.. అది కూడా ఓపెన్‌ చేసి చూపించు’ అని ఒకరు ఎద్దేవా చేయగా, ఆ బ్యాట్‌కు సంబంధించి స్ప్రింగ్‌ను ఎక్కడ దాచావ్‌’ అని మరొక అభిమాని ప్రశ్నించాడు. ‘ స్ప్రింగ్‌తో తయారు చేసిన బ్యాట్‌ అది’ మరొక అభిమాని సెటైర్‌ వేశాడు.  ‘ నీ బ్యాట్‌ అసల రూపం ఇది’ అని ఆ బ్యాట్‌కు స్ప్రింగ్‌ తగలించి మరీ ఒక అభిమాని రిప్లై ఇచ్చాడు. సరిగ్గా నేటికి(మార్చి 23) ఆ ఫైనల్‌ జరిగి 17 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో పాంటింగ్‌ తన బ్యాట్‌ను షేర్‌ చేసుకుంటే దానికి అభిమానులు మాత్రం ఇలా విమర్శలకు దిగుతున్నారు. కాగా, ఐసీసీ మాత్రం ‘2003లో ఇదే రోజు’  అని పాంటింగ్‌ పోస్ట్‌కు బదులిచ్చింది.

మరిన్ని వార్తలు