స్పిన్నర్ల చెత్త రికార్డు.. పేసర్ల కొత్త రికార్డు!

21 Nov, 2017 11:01 IST|Sakshi

కోల్ కతా:భారత్-శ్రీలంక జట్ల మధ్య ఇక్కడ జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రా ముగిసినప్పటికీ పలు రికార్డులు నమోదయ్యాయి. ప్రధానంగా భారత ఆటగాళ్లు అనేక రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇందులో కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు మిడిల్ ఆర్డర్ ఆటగాడు చతేశ్వర పుజారాలు అరుదైన ఘనతలను సాధించారు.  ఇదిలా ఉంచితే, భారత స్పిన్నర్లు ఓ అపప్రథను మూటగట్టుకున్నారు. సొంతగడ్డపై జరిగిన టెస్టు మ్యాచ్ ల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా పేలవ ప్రదర్శన చేశారు.

ఫలితంగా స్వదేశంలో జరిగిన ఒక టెస్టు మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు ఒక్క వికెట్‌ కూడా తీయకపోవడం ఇదే తొలిసారి. కాగా, అదే సమయంలో భారత పేసర్లు కొత్త రికార్డును నమోదు చేశారు. ఓవరాల్ గా మన పేసర్లు సొంతగడ్డపై జరిగిన టెస్టు మ్యాచ్ లో 17 వికెట్లు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు భారత్ పేసర్లు 16 వికెట్లను మాత్రమే ఒక టెస్టు మ్యాచ్ లో సాధించారు. గతంలో మూడుసార్లు భారత పేసర్లు 16 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఇంగ్లండ్ పై చెన్నైలో(1933-34), ఢిల్లీలో పాకిస్తాన్ పై(1978-79), కోల్ కతాలో(1998-99) జరిగిన టెస్టుల్లో 16 వికెట్లను భారత పేసర్లు సాధించారు. తాజాగా ఆ రికార్డును సవరించారు.

మరిన్ని వార్తలు