ఫుట్‌బాల్‌ దిగ్గజం కన్నుమూత.. సచిన్‌ సంతాపం

20 Mar, 2020 16:25 IST|Sakshi
పీకే బెనర్జీతో గంగూలీ, సచిన్‌ (ఫైల్‌ ఫోటో)

కోల్‌కతా: భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం, మాజీ సారథి ప్రదీప్‌ కుమార్‌ బెనర్జీ (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. ఆటగాడిగా భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన బెనర్జీ..  అనంతరం కోచ్‌గా కూడా జట్టుకు తన సేవలను అందించారు. 1936లో జన్మించిన బెనర్జీ భారత్‌ తరుపున 84 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించి 65 గోల్స్‌ సాధించారు. 1962లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో భారత్‌ స్వర్ణం గెలవడంలో బెనర్జీ కీలక పాత్ర పోషించారు. 

అంతేకాకుండా 1960లో జరిగిన రోమ్‌ ఒలింపిక్స్‌లో ఫ్రెంచ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ తరుపును ఏకైక గోల్‌ సాధించి మ్యాచ్‌ను డ్రా చేసేందుకు సహాయపడ్డారు. ఇక రోమ్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టుకు పీకే బెనర్జీనే సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.  పీకే బెనర్జీ మరణం యావత్‌ క్రీడా ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. ఈ దిగ్గజ ప్లేయర్‌ మృతి పట్ల భారత మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.  ఈ సందర్భంగా ఆయనతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆయనతో దిగిన ఫోటోను సచిన్‌ తన ట్విటర్‌లో ఫోస్ట్‌ చేశారు. పీకే బెనర్జీకి ఇద్దరు కుమార్తెలు. ఆయన తమ్ముడు ప్రసూన్‌ బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్నారు.

మరిన్ని వార్తలు