టోక్యోలో గెలుస్తా...

16 Aug, 2016 00:38 IST|Sakshi
టోక్యోలో గెలుస్తా...

రియోలో పతకం ఆశించలేదు
నా ప్రదర్శన సిమోన్ కన్నా గొప్ప 
జిమ్నాస్ట్ దీపా కర్మాకర్


ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌లో దీపా కర్మాకర్ ప్రదర్శనపై భారతదేశం మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. కేవలం 0.15 పాయింట్ల తేడాతో కాంస్యం కోల్పోయినా అందరితో శభాష్ అనిపించుకుంది. ఈ త్రిపుర అమ్మాయి కూడా తన ప్రదర్శన పట్ల అమితానందాన్ని వ్యక్తం చేసింది. తృటిలో పతకం కోల్పోయినందుకు తానేమీ బాధపడడం లేదని, వాస్తవానికి రియో గేమ్స్‌లో మెడల్ ఆశించలేదని స్పష్టం చేసింది. ఫైనల్స్‌లో తను ల్యాండింగ్ సరిగ్గానే చేసినా కొన్ని సెకన్ల పాటు కింద కూర్చోవడంతో పాయింట్లు కోల్పోయింది. అయితే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం కచ్చితంగా స్వర్ణం నెగ్గుతానని ధీమా వ్యక్తం చేస్తోన్న 23 ఏళ్ల దీపా చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే..

 
పతకాన్ని ఊహించలేదు: నిజం చెప్పాలంటే రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని ఆశించలేదు. కానీ నాలుగో స్థానంలో నిలవడం గర్వంగా ఉంది. బాక్సింగ్‌లోనైతే ఈ స్థానంలో వస్తే కాంస్యం దక్కేది. కానీ నాలుగేళ్ల తర్వాత నా లక్ష్యం స్వర్ణంపైనే ఉంటుంది. ఇది నా తొలి ఒలింపిక్స్ కాబట్టి నిరాశ అవసరం లేదు.

 
అత్యుత్తమ స్కోరు సాధించా: ఓవరాల్‌గా నా ప్రదర్శనపై సంతృప్తికరంగా ఉన్నాను. ఫైనల్స్‌లో 15.066తో నా అత్యధిక స్కోరు సాధించా. అయితే పతకం సాధించిన వారు నాకన్నా మెరుగైన ప్రదర్శన చేశారు. కొద్ది పాయింట్ల తేడాతో పతకం కోల్పోయాను. అయినా నా తొలి గేమ్స్‌లో నాలుగో స్థానాన్ని నేను ఊహించలేదు. రెండు వాల్ట్స్‌లో నా స్కోరును మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టి విజయవంతమయ్యాను. ప్రొడునోవాలో గతంలో 15.1 స్కోరు అత్యధికంగా ఉండేది. ఇక్కడ 15.266 వరకు సాధించగలిగాను.

 
స్వదేశీ కోచ్‌తోనే ఇంత సాధించాను: జిమ్నాస్టిక్స్ అంత సులువైన క్రీడ కాదు. మనకు ఇందులో విదేశీ కోచ్ కూడా లేడు. నేనింత వరకు సాధించింది కూడా స్వదేశీ కోచ్ బిశ్వేశ్వర్ నంది, సాయ్ కృషితోనే. ఒలింపిక్స్‌కు మూడు నెలల ముందే సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. ఒలింపిక్ మాజీ చాంపియన్లను కూడా వెనక్కినెట్టి నాలుగో స్థానంలో నిలవగలిగాను. అందుకే ఇది సిమోన్ బైల్స్ సాధించిన దానికన్నా పెద్ద ఘనతగా నేను భావిస్తున్నాను.

 
విశేష మద్దతు: కోట్లాది మంది భారతీయుల ప్రార్థనల వల్లే ఇక్కడిదాకా రాగలిగాను. వారందరికీ నా కృతజ్ఞతలు. గతంలో మిల్కా సింగ్, పీటీ ఉష కూడా నాలుగో స్థానంలో నిలిచారని పోలిక తెస్తున్నా... నేను వారితో సరితూగలేను. స్వర్ణం సాధించాకే వారితో పోల్చుకోగలను.


అభినందనల వెల్లువ
తృటిలో పతకం చేజార్చుకున్న దీపా కర్మాకర్‌పై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘గెలుపు, ఓటమి అనేది ఏ క్రీడలోనైనా సహజమే. కానీ నీవు లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నావు. భారతదేశమంతా నీ ఘనతకు గర్విస్తోంది’ అని సచిన్ ట్వీట్ చేయగా... ‘దీపా.. నువ్వు నా హీరోవి’ అని షూటర్ అభినవ్ బింద్రా స్పందించాడు. అమితాబ్ సహా పలువరు బాలీవుడ్ ప్రముఖులు కూడా ట్వీట్ల ద్వారా అభినందనలు తెలిపారు.


గేమ్స్ విలేజికి వెళ్లాక బాధను ఆపుకోలేక భోరున విలపించింది. ‘దీప పోరాటాన్ని అంతా పొగిడినా మేం మాత్రం ప్రపంచాన్ని కోల్పోయినట్టుగా భావించాం. మా దృష్టిలో ఈ స్వాతంత్య్ర దినోత్సవం భారంగా గడిచింది. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. దీప చాలాసేపు విలపించింది’ అని కోచ్ నంది అన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా