దివికేగిన దిగ్గజం

26 May, 2020 00:11 IST|Sakshi

భారత హాకీ మాంత్రికుడు బల్బీర్‌సింగ్‌ కన్నుమూత

మూడు ఒలింపిక్స్‌ స్వర్ణాల్లో కీలకపాత్ర 1975లో ఆయన శిక్షణలోనే ప్రపంచకప్‌ నెగ్గిన భారత్‌

‘పద్మశ్రీ’ పొందిన తొలి క్రీడాకారుడిగా ఘనత

కెరీర్‌ మొత్తంలో 61 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన బల్బీర్‌ 246 గోల్స్‌ చేశారు.

చండీగఢ్‌: ప్రపంచ హాకీ పుటలకెక్కిన భారత హాకీ మాంత్రికుడు, దివంగత దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌తో సరితూగే గోల్స్‌ వేటగాడు బల్బీర్‌ సింగ్‌ సీనియర్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 96 ఏళ్లు. వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో సోమవారం ఉదయం బల్బీర్‌ సింగ్‌ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 8న తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన్ని మొహాలీలోని ఫోర్టిస్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తుండగా... సోమవారం ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారని హాస్పిటల్‌ డైరెక్టర్‌ అభిజిత్‌ సింగ్‌ వెల్లడించారు. చికిత్స పొందుతుండగానే ఈ నెల 18న న్యుమోనియా, జ్వరం, శ్వాసనాళ సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో పాటు మెదడులోని రక్తనాళాలు గడ్డకట్టడంతో సెమీ కోమా స్థితికి వచ్చారు. వృద్ధాప్యభారం వల్ల చికిత్సకు ఆయన శరీరం సహకరించకపోవడంతో తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. బల్బీర్‌కు ఒక కుమార్తె సుశ్‌బీర్, ముగ్గురు కుమారులు కన్వల్‌బీర్, కరణ్‌బీర్, గుర్‌బీర్‌ సింగ్‌లున్నారు. కొడుకులంతా కెనడాలో స్థిరపడగా... కుమార్తె, మనవడు కబీర్‌తో కలిసి ఆయన మొహాలీలో ఉన్నారు.

అంపశయ్యపై పోరాడుతూనే... 
అలనాడు మైదానంలో దేశాన్ని గెలిపించేందుకు ప్రత్యర్థులతో వీరోచితంగా పోరాడిన బల్బీర్‌ సింగ్‌ గత 18 రోజులుగా ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడారు. చికిత్సలో ఉండగానే మూడుసార్లు గుండెపోటుకు గురైనా తట్టుకున్న ఆయన చివరకు మెదడు రక్తనాళాలు గడ్డకట్టడంతో అచేతన స్థితిలోకి వెళ్లిపోయారు. ఇక సోమవారం తెల్లవారగానే పోరాటం ముగించారు. గత రెండేళ్లుగా తరచూ ఆయన తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. పలుమార్లు ఐసీయూలో చికిత్స పొందాక ఇంటికెళ్లేవారు. కానీ ఈసారి మాత్రం దివికేగారు. కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రస్తుత నిబంధనల ప్రకారం బల్బీర్‌కు వైరస్‌ పరీక్ష చేయగా... నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. విజయవంతమైన బల్బీర్‌  కెరీర్‌లో గోల్స్, రికార్డులే కాదు అవార్డులూ ఉన్నాయి.

అధికారిక లాంఛనాలతో... 
భారత హకీలో మరో ‘బంగారు’కొండ అయిన బల్బీర్‌ సింగ్‌ సీనియర్‌కు పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. పోలీసు ఉన్నతాధికారుల తుపాకులతో గౌరవ వందనం సమర్పించగా... బల్బీర్‌ మనవడు కబీర్‌ దహన సంస్కారాలు నిర్వహించాడు. ఇదంతా ఎలక్ట్రిక్‌ దహన కార్యక్రమంతో ముగించారు. కుమారులు ముగ్గురు కెనడాలోనే ఉండటంతో ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇక్కడికి చేరుకునే అవకాశం లేకపోవడంతో అంత్యక్రియలకు వెంటనే ఏర్పాట్లు చేశారు. ఆ రాష్ట్ర క్రీడల మంత్రి రాణా గుర్మీత్‌ సింగ్‌ సోధి మొహాలీ హాకీ స్టేడియానికి బల్బీర్‌ సింగ్‌ పేరు పెడతామని ప్రకటించారు.

చిరకాలం గుర్తుంటారు...
దిగ్గజ హాకీ ప్లేయర్‌ బల్బీర్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్స్‌ సర్దార్‌ సింగ్, వీరేన్‌ రస్కినా, శ్రీజేష్‌ తదితరులు కూడా బల్బీర్‌కు నివాళులు అర్పించారు. ఎవరేమన్నారంటే... అద్భుతమైన ఆటతీరుతో బల్బీర్‌ సింగ్‌ చిరకాలం గుర్తుంటారు. తన ఆటతో ఆయన దేశానికి ఎన్నో విజయాలు అందించారు. ప్లేయర్‌గానే కాకుండా కోచ్‌గా కూడా ఆయన అద్భుతాలు చేశారు. –ప్రధాని నరేంద్ర మోదీ

బల్బీర్‌ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. వరుసగా మూడు ఒలింపిక్స్‌ క్రీడల్లో స్వర్ణాలు సాధించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. –కిరణ్‌ రిజిజు, కేంద్ర క్రీడల మంత్రి

బల్బీర్‌ సింగ్‌ ఇక లేరు అన్న వార్త విని చాలా బాధపడ్డాను. ఆయనలాంటి క్రీడాకారులు అరుదుగా ఉంటారు. నేటితరం క్రీడాకారులందరికీ ఆయన ఆదర్శం. –అభినవ్‌ బింద్రా,  ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం బల్బీర్‌ సింగ్‌ సొంతం. హాకీపట్ల ఆయనకున్న అభిమానం వెలకట్టలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మాతో ఉంటాయి.
–నరీందర్‌ బత్రా, అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు

బల్బీర్‌ సింగ్‌ తన ఆటతో హాకీ క్రీడకే ఎంతో వన్నె తెచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. –సచిన్‌ టెండూల్కర్, క్రికెట్‌ దిగ్గజం

బల్బీర్‌ సింగ్‌ నాతోపాటు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. –సర్దార్‌ సింగ్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌

మరిన్ని వార్తలు