'మన బంగారం' మెరుస్తుందా!

16 Jul, 2016 00:41 IST|Sakshi
'మన బంగారం' మెరుస్తుందా!

ఒకప్పుడు ఒలింపిక్స్‌లో హాకీ స్టిక్ మనం చెప్పినట్లుగా ఆడింది... మైదానంలో ఏ మూలనుంచి కొట్టినా గోల్ పోస్ట్ వైపే బంతి పరుగులు తీసింది. మంత్ర దండం అనండి, మ్యాజిక్ అనుకోండి... ఏదైనా మన మార్క్ మాత్రం గట్టిగా ముద్రించుకు పోయింది. జట్టులో ప్రతీ ఒక్కరూ దిగ్గజమే. ఒకరినుంచి మరొకరు చెలరేగి పోతుంటే భారత్‌ను హాకీలో ఆపడం వృథా ప్రయత్నం అనుకున్న ప్రత్యర్థులు అప్పట్లో రెండో స్థానం కోసమే పోటీ పడటంతోనే సరిపెట్టేశారు.

ఇప్పటికీ  ఏ దేశానికి సాధ్యం కాని విధంగా ఒలింపిక్స్‌లో భారత్‌కు ఏకంగా ఎనిమిది స్వర్ణాలు లభించాయి. కానీ ఇప్పుడు... ఒలింపిక్స్‌లో పతకం కళ్ల చూసి మూడున్నర దశాబ్దాలు గడిచిపోయాయి. మాస్కో పోటీల్లో స్వర్ణం తర్వాత దిగజారడం మొదలు పెట్టిన మన హాకీ అంతకంతకు పతనం దిశగా పయనించింది. సాంప్రదాయ శైలిని ఒక్కసారిగా వీడలేక, ఆధునిక ఆటను అందుకోలేక నలిగి పోవడంతో హాకీ కథ వ్యథగా మారి పోయింది. మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి.

 
* ఆశలు రేపుతున్న భారత హాకీ
* పతకం సాధించేందుకు అవకాశాలు
* గతంలో ఎనిమిది స్వర్ణాలు నెగ్గిన రికార్డు

భారత అభిమాని ఇప్పుడు మరో సారి హాకీ జట్టు వైపు ఆశగా చూస్తున్నాడు. గత లండన్ ఒలింపిక్స్‌లో మరీ ఘోరంగా 12వ స్థానంలో నిలిచిన పరాభవం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే ఆ తర్వాత జట్టు ఆట అందరిలో కాస్త  నమ్మకాన్ని పెంచుతోంది. 2012, 2014 చాంపియన్స్ ట్రోఫీలలో నాలుగో స్థానం, ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు సుల్తాన్ అజ్లాన్‌షా టోర్నీలో వరుసగా రెండు సార్లు మెరుగైన ప్రదర్శనతో జట్టు కాస్త దారిలోకి వచ్చినట్లు కనిపించింది.

కొత్త కోచ్ ఓల్ట్స్‌మన్ నేతృత్వంలో ఇటీవలే చాంపియన్స్ ట్రోఫీలో రజత పతకం గెలుచుకోవడం కీలక పరిణామం. ఈ గెలుపుతో మన టీమ్‌పై అంచనాలు పెరిగాయి. మరి ఒలింపిక్స్‌లో ఈ ఫలితం జట్టు పునరావృతం చేస్తుందా అనేది ఆసక్తికరం.
 
గతమెంతో ఘనం...

1928 ఆమ్‌స్టర్‌డామ్ ఒలింపిక్స్‌లో భారత జట్టు తొలి సారిగా స్వర్ణ పతకం గెలుచుకుంది. ఫైనల్లో ధ్యాన్‌చంద్ చేసిన మూడు గోల్స్ కారణంగా 3-0తో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసి తమ జైత్ర యాత్ర మొదలు పెట్టింది. ఆ తర్వాత మరో రెండు సార్లు స్వర్ణం నెగ్గిన జట్టు... స్వాతంత్య్రానంతరం మువ్వన్నెల జెండా కింద మరో మూడు బంగారు పతకాలు సొంతం చేసుకుంది. దీంతో మరొకరికి అవకాశం ఇవ్వకుండా వరుసగా ఆరు స్వర్ణాలు మన ఖాతాలో చేరాయి. తర్వాతి ఒలింపిక్స్‌లో రజతానికే పరిమితమై 1964లో మరో గోల్డ్ కొట్టింది.

అనంతరం జరిగిన మూడు ఒలింపిక్స్‌లలో రెండు కాంస్యాలు మాత్రమే జట్టుకు లభించాయి. అయితే 1980 మాస్కో ఒలింపిక్స్ మరో సారి మన బంగారు దశను గుర్తుకు తెచ్చాయి. భాస్కరన్, జఫర్ ఇక్బాల్, మొహమ్మద్ షాహిద్, రాజీందర్ సింగ్‌లతో కూడిన మన జట్టు స్పెయిన్‌ను చిత్తు చేసి స్వర్ణ పతకం సాధించింది. ఆ తర్వాతి తరంలో పర్గత్ సింగ్, ధన్‌రాజ్ పిళ్లై, ముకేశ్ కుమార్, జూడ్ ఫెలిక్స్, దిలీప్ తిర్కీ తదితరులు హాకీలో సుదీర్ఘ కాలం తమ ముద్ర చూపించినా వారికి, భారత్‌కు ఒలింపిక్ పతకం కలగానే మిగిలింది.
 
ఉత్సాహంగా జట్టు
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓడినా... ఇంత నిలకడగా మ్యాచ్ ఆసాంతం ఆడటం నేనెప్పుడూ చూడలేదు. ఇది నాకు పతకంపై ఆశలు రేపుతోంది... హాకీ దిగ్గజం ధన్‌రాజ్ పిళ్లై పరిశీలన ఇది. చాలా రోజుల తర్వాత మన జాతీయ జట్టు కోచ్‌పై కూడా ఏకాభిప్రాయంతో ప్రశంసలు కురిశాయి. జట్టు డిఫెన్స్, మిడ్ ఫీల్డ్ ఎంతో మెరుగైంది. ఫార్వర్డ్ విభాగంలో మరింత చురుకుదనం కావాల్సి ఉన్నా... బలమైన రక్షణ శ్రేణితో ప్రత్యర్థిని అడ్డుకోగల సామర్థ్యం జట్టుకు ఉంది.

కెప్టెన్సీకి దూరమైన సర్దార్ సింగ్ ఆటలో ఇటీవల చాలా మార్పు వచ్చింది. వేగం పెంచిన అతను ప్రత్యర్థి 25 యార్డ్ సర్కిల్‌లోకి దూసుకెళ్లి అవకాశాలు సృష్టిస్తున్నాడు. ఇక పెట్టని కోటలా గోల్‌కీపర్ శ్రీజేశ్ కీలక సమయంలో భారత్‌ను ఆదుకున్నాడు. ఇప్పుడు కెప్టెన్సీతో అతనిపై బాధ్యత మరింత పెరిగింది. మొత్తంగా మన ఆటగాళ్లు గతంతో పోలిస్తే దూకుడు పెంచారు.  ఆత్మవిశ్వాసం తో బరిలోకి దిగుతున్న జట్టు పతకంతో తిరిగి రావాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు.
 
అమ్మాయిలు ఏం చేస్తారో..!
ఒలింపిక్స్‌లో తొలి సారి మహిళల  హాకీని 1980లో ప్రవేశ పెట్టారు. నాడు బరిలోకి దిగిన భారత్ రౌండ్ రాబిన్ తరహాలో జరిగిన పోటీల్లో ఐదు మ్యాచ్‌లలో 2 గెలిచి 2 ఓడింది. మరో మ్యాచ్ డ్రా అయింది. మొత్తంగా నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్యం కోల్పోయింది. ఆ తర్వాతి ఒలింపిక్స్‌లో ఒక్కసారి కూడా మన మహిళా జట్టు అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్లీ అవకాశం వచ్చింది. హాకీ వరల్డ్ లీగ్‌లో ఐదో స్థానంలో నిలిచిన అనంతరం జట్టు రియోకు క్వాలిఫై అయింది. జట్టు సభ్యులంతా తొలి సారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్నారు కాబట్టి ఒత్తిడిని తట్టుకొని ఎలా ఆడగలరో చూడాలి. పతకంపై పెద్దగా ఆశలు లేకున్నా... సంచలనం సృష్టించే సత్తా ఉంది.
 
36
పురుషుల జట్టు ఒలింపిక్స్‌లో పతకం సాధించి 36 ఏళ్లు అయింది. మహిళల జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించి 36 ఏళ్లు అయింది.

మరిన్ని వార్తలు