భారత్‌ షూటౌట్‌ 

31 Mar, 2019 01:14 IST|Sakshi

అజ్లాన్‌ షా ఫైనల్లో పరాజయం 

విజేతగా నిలిచిన కొరియా 

ఇపో (మలేసియా): చివరి నిమిషాల్లో గోల్‌ ఇచ్చుకోవడం...ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్‌లో విఫలం కావడం...ఇటీవల భారత హాకీ జట్టు పరాజయాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. శనివారం అజ్లాన్‌ షా టోర్నీ ఫైనల్లో కూడా ఇదే తరహాలో భారత్‌ ఓడింది. తుది పోరులో  కొరియా 4–2 తేడాతో (షూటౌట్‌లో) ఐదు సార్లు చాంపియన్‌ భారత్‌పై విజయం సాధించి సగర్వంగా టైటిల్‌ సొంతం చేసుకుంది. 9వ నిమిషంలోనే సిమ్రన్‌జిత్‌ సింగ్‌ చేసిన ఫీల్డ్‌ గోల్‌తో భారత్‌ 1–0తో ముందంజ వేసింది. మూడు క్వార్టర్ల పాటు మన జట్టు ఈ ఆధిక్యాన్ని కొనసాగించింది. అయితే నాలుగో క్వార్టర్‌ ప్రారంభం కాగానే (47వ నిమిషంలో) కొరియాకు పెనాల్టీ స్ట్రోక్‌ లభించింది. భారత్‌ వీడియో రిఫరల్‌కు వెళ్లినా ఫలితం దక్కలేదు.

జంగ్‌ జోంగ్‌ హ్యూన్‌ దీనిని గోల్‌గా మలచి స్కోరు    సమం చేశాడు. చివర్లో పెనాల్టీ అవకాశం దక్కినా భారత్‌   దానిని ఉపయోగించుకోలేకపోయింది. షూటౌట్‌లో భారత్‌ తరఫున బీరేంద్ర లక్డా, వరుణ్‌ కుమార్‌ గోల్స్‌     నమోదు  చేయగా... మన్‌దీప్‌ సింగ్, సుమీత్, సుమీర్‌ కుమార్‌ జూనియర్‌ గోల్‌ చేయడంలో విఫలమయ్యారు. వర్గీకరణ మ్యాచ్‌లో కెనడాను 4–2తో ఓడించి ఆతిథ్య మలేసియా మూడో స్థానంలో నిలిచింది.    

మరిన్ని వార్తలు