ఏషియన్‌ గేమ్స్‌ చరిత్రలో తొలిసారి..

23 Aug, 2018 18:44 IST|Sakshi

జకర్తా: ప్రపంచ కబడ్డీ చాంపియన్‌ భారత్‌కు ఆసియా క్రీడల్లో ఊహించని షాక్‌ తగిలింది. ఏషియన్‌ గేమ్స్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫైనల్‌ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. సెమీఫైనల్‌లో భాగంగా గురువారం బలమైన ఇరాన్‌ చేతిలో 18-27 తేడాతో భారత్‌ ఘోర ఓటమి చవిచూసింది. ఆట ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన ఇరాన్‌ ఆటగాళ్లు.. బలమైన డిఫెన్స్‌తో అజయ్‌ ఠాకూర్‌సేనకు పాయింట్లు చిక్కకుండా అడ్డుకున్నారు. బలమైన డిఫెండింగ్‌ గల ఇరాన్‌ సూపర్‌ ట్యాకిల్‌ పాయింట్లతో విరుచుకపడింది. దీంతో ఆత్మరక్షణలో పడిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టుకు తలవంచారు.

టీమిండియా సారథి అజయ్‌ ఠాకూర్‌,  ప్రో కబడ్డీ లీగ్‌ స్టార్‌ రైడర్లు ప్రదీప్‌ నర్వాల్‌, రాహుల్‌ చౌదరీ, రిషాంక్‌ దేవడిగా, మోనూ గోయత్‌లు ఇరాన్‌ డిఫెండింగ్‌ ముందు తేలిపోయారు.భారత రైడర్లు పాయింట్లు తేవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇక డిఫెండింగ్‌లోనూ భారత ఆటగాళ్లు అంతగా రాణించలేకపోయారు. తొలుత డిఫెండర్‌ గిరీష్‌ మారుతి ఎర్నాక్ రాణించినా చివర్లో విఫలమయ్యారు.  మోహిత్‌ చిల్లర్‌, ‌దీపక్‌ నివాస్‌ హుడా, సందీప్‌ నర్వాల్‌లు కూడా చేతులెత్తాశారు. భారత ఆటగాళ్లు  సమిష్టిగా విఫలమవ్వడంతో ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుస్తుందనుకున్న జట్టు తొలి సారి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇక మరోవైపు భారత మహిళల కబడ్డీ  జట్టు ఆసియా క్రీడల్లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన సెమీఫైనల్‌లో భారత మహిళల జట్టు 27-14తేడాతో చైనీస్‌ తైపీ జట్టును చిత్తు చేసి కనీసం రజతం ఖాయం చేశారు. 

మరిన్ని వార్తలు