ఐదో స్థానమైనా అదే రికార్డు

19 Sep, 2019 10:13 IST|Sakshi

వర్గీకరణ మ్యాచ్‌లో 3–0తో భారత్‌ విజయం

ఆసియా టీటీ చాంపియన్‌షిప్‌

యోగ్యకార్త: ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు ఐదో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీ చరిత్రలో మనకిదే అత్యుత్తమం కావడం విశేషం. బుధవారం 5–6 స్థానాల కోసం ఇక్కడ జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ 3–0తో హాంకాంగ్‌పై నెగ్గింది. దీంతోపాటు చాంపియన్స్‌ డివిజన్‌లో ఇరాన్‌ను 3–0తో ఓడించి స్వర్ణం గెల్చుకుంది. వర్గీకరణ మ్యాచ్‌లో తొలుత శరత్‌ కమల్‌ 9–11, 11–6, 7–11, 11–7, 11–7తో లామ్‌ స్యు హంగ్‌ను ఓడించాడు.

రెండో మ్యాచ్‌లో అమల్‌ రాజ్‌  9–11, 11–4, 11–6, 11–7 స్కోరుతో ఎన్‌జీ పాక్‌నమ్‌పై గెలిచాడు. మూడో దాంట్లో సత్యన్‌  11–5, 11–13, 11–7, 14–12తో క్వాన్‌ మన్‌ హొపై నెగ్గాడు. దీంతో తదుపరి రెండు మ్యాచ్‌లు నిర్వహించాల్సిన అవసరం లేకుండానే భారత్‌ జయభేరి మోగించినట్లైంది. టీమ్‌ విభాగంలో సత్యన్‌ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలుపొందడం విశేషం.  వ్యక్తిగత విభాగం పోటీలు గురువారం మొదలవుతాయి.

మరిన్ని వార్తలు