పురుషులు ‘ఆరు’...  మహిళలు ‘ఎనిమిది’ 

6 Oct, 2018 01:00 IST|Sakshi

పతకాలు నెగ్గలేకపోయిన భారత జట్లు

చెస్‌ ఒలింపియాడ్‌లో చైనా ‘డబుల్‌’  

బటూమి (జార్జియా): భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత పురుషుల, మహిళల జట్లు చెస్‌ ఒలింపియాడ్‌ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగాయి. శుక్రవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో విశ్వనాథన్‌ ఆనంద్, పెంటేల హరికృష్ణ, విదిత్‌ సంతోష్‌ గుజరాతి, ఆధిబన్, కృష్ణన్‌ శశికిరణ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 16 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తానియా సచ్‌దేవ్, ఇషా కరవాడే, పద్మిని రౌత్‌లతో కూడిన భారత మహిళల జట్టు 16 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. చివరిదైన 11వ రౌండ్‌లో పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను భారత పురుషుల జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ఆనంద్‌–జాన్‌ క్రిస్టోఫ్‌ డూడా గేమ్‌ 25 ఎత్తుల్లో... హరికృష్ణ–రాడోస్లా గేమ్‌ 30 ఎత్తుల్లో... విదిత్‌–కాక్‌పెర్‌ గేమ్‌ 48 ఎత్తుల్లో... ఆధిబన్‌–జాసెక్‌ టామ్‌జాక్‌ గేమ్‌ 55 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. ఓవరాల్‌గా భారత్‌ ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండింటిలో ఓడి, మరో రెండింటిని ‘డ్రా’ చేసుకుంది.  

మరోవైపు మంగోలియాతో జరిగిన చివరి మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 3–1తో గెలిచింది. హారిక–బతుయాగ్‌ మున్‌గున్‌తుల్‌ గేమ్‌ 72 ఎత్తుల్లో... ఇషా–ముంక్‌జుల్‌ గేమ్‌ 36 ఎత్తుల్లో ‘డ్రా’కాగా... తానియా 60 ఎత్తుల్లో నోమిన్‌పై, పద్మిని 65 ఎత్తుల్లో దులామ్‌సెరెన్‌పై విజయం సాధించారు. ఓవరాల్‌గా భారత జట్టు ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని... హంగేరి చేతిలో ఓడిపోయింది. ఎనిమిదో రౌండ్‌లో హంగేరి చేతిలో ఓటమి భారత జట్టు పతకావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది.   నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నమెంట్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో చైనా విజేతగా నిలిచి ‘డబుల్‌’ సాధించింది. పురుషుల విభాగంలో చైనా, అమెరికా, రష్యా 18 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచినా... మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా చైనాకు స్వర్ణం... అమెరికా ఖాతాలో రజతం చేరగా... రష్యా జట్టు కాంస్యం కైవసం చేసుకుంది. మహిళల విభాగంలో చైనా, ఉక్రెయిన్‌ 18 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా చైనాకు పసిడి పతకం ఖాయమైంది. ఉక్రెయిన్‌కు రజతం, 17 పాయింట్లు సాధిం చిన జార్జియా జట్టుకు కాంస్యం లభించింది.    

మరిన్ని వార్తలు