పసిడిపై గురి

14 Jun, 2019 05:56 IST|Sakshi

రికర్వ్‌ విభాగంలో ఫైనల్‌కు చేరిన భారత పురుషుల ఆర్చరీ జట్టు

14 ఏళ్ల తర్వాత ఈ ఘనత  

ఎస్‌–హెర్టోజెన్‌బాష్‌ (నెదర్లాండ్స్‌): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత పురుషుల ఆర్చరీ జట్టు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. బుధవారం క్వార్టర్‌ ఫైనల్‌కు చేరి టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న భారత బృందం... గురువారం మరో రెండు విజయాలు సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. తరుణ్‌దీప్‌ రాయ్, అతాను దాస్, ప్రవీణ్‌ రమేశ్‌ జాదవ్‌లతో కూడిన భారత బృందం క్వార్టర్‌ ఫైనల్లో 6–0తో చి చుంగ్‌ టాన్, యు చెంగ్‌ డెంగ్, చున్‌ హెంగ్‌ చెలతో కూడిన చైనీస్‌ తైపీ జట్టును ఓడించింది. భారత్‌ తొలి సెట్‌ను 55–52తో, రెండో సెట్‌ను 55–48తో, మూడో సెట్‌ను 55–54తో గెల్చుకుంది. ఒక్కో సెట్‌కు రెండు పాయింట్ల చొప్పున ఇస్తారు.

సెమీఫైనల్లో భారత జట్టు ‘షూట్‌ ఆఫ్‌’లో వాన్‌ డెన్‌ బెర్గ్, వాన్‌ డెర్‌ వెన్, స్టీవ్‌ విజ్లెర్‌లతో కూడిన నెదర్లాండ్స్‌ జట్టుపై గెలిచింది. తొలి సెట్‌ను నెదర్లాండ్స్‌ 56–54తో, రెండో సెట్‌ను భారత్‌ 52–49తో, మూడో సెట్‌ను నెదర్లాండ్స్‌ 57–56తో, నాలుగో సెట్‌ను భారత్‌ 57–55తో గెల్చుకున్నాయి. దాంతో స్కోరు 4–4తో సమమైంది. విజేతను నిర్ణయించేందుకు ‘షూట్‌ ఆఫ్‌’ను నిర్వహించగా... భారత్‌ 29–28తో నెదర్లాండ్స్‌ను ఓడించి ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది. 14 ఏళ్ల తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్‌ చేరింది. చివరిసారి 2005లో భారత్‌ ఫైనల్‌ చేరి తుది పోరులో 232–244తో కొరియా చేతిలో ఓడి రజతం దక్కించుకుంది. చివరిసారి ఫైనల్‌ చేరిన నాటి భారత జట్టులోనూ తరుణ్‌దీప్‌ రాయ్‌ సభ్యుడిగా ఉండటం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో భారత్‌ పోటీపడుతుంది.

మరిన్ని వార్తలు