ప్రణయ్ సంచలనం

27 Mar, 2015 01:12 IST|Sakshi
ప్రణయ్ సంచలనం

ప్రపంచ రెండో ర్యాంకర్‌పై గెలుపు

న్యూఢిల్లీ: అంచనాలకు మించి రాణించిన భారత బ్యాడ్మింటన్ యువతార హెచ్‌ఎస్ ప్రణయ్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ ప్రణయ్ 18-21, 21-14, 21-14తో టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)ను బోల్తా కొట్టించి తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. ప్రణయ్‌తోపాటు హైదరాబాద్ ఆటగాళ్లు రెండో సీడ్ కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే కశ్యప్‌కు మాత్రం ఓటమి ఎదురైంది.

ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21-12, 15-21, 21-15తో కెంటో మోమోటా (జపాన్)పై నెగ్గాడు.  ఈ గెలుపుతో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ తొలి రౌండ్‌లో మోమోటా చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నాడు. మరో మ్యాచ్‌లో గురుసాయిదత్ అతికష్టమ్మీద 18-21, 21-19, 21-18తో క్వాలిఫయర్ సమీర్ వర్మ (భారత్)పై గెలిచాడు.

కశ్యప్ 17-21, 11-21తో జుయ్ సాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు.  మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ సైనా 21-16, 21-17 తో హైదరాబాద్‌కే చెందిన గద్దె రుత్విక శివానిపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కోనా తరుణ్-సంతోష్ రావూరి ద్వయం 12-21, 11-21తో నాలుగో సీడ్ లియు జియోలాంగ్-కియు జిహాన్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది.

మరిన్ని వార్తలు