పారాఅథ్లెట్‌తో బిచ్చమెత్తించారు..

12 Jul, 2017 18:57 IST|Sakshi
పారాఅథ్లెట్‌తో బిచ్చమెత్తించారు..

న్యూఢిల్లీ: శారీరక లోపాలతో సతమతమవుతున్నా వెరవక కష్టించి.. ఏదో సాధించి దేశం పేరు మార్మొగేలా చేయాలని తపన పడుతున్న ఓ పారాఅథ్లెట్‌కు తీవ్ర అవమానం జరిగింది. దృష్టిలోపం గల కాంచనమాల పాండే ఈ నెల 3 నుంచి 9 వరకూ జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన పారా స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొని వెండి పతకం సాధించారు. అయితే, చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న సమయంలో ఖర్చులకు డబ్బు లేకపోవడంతో ఆమె బిచ్చమెత్తినట్లు రిపోర్టులు వచ్చాయి.

కాంచనమాల పాండే ఇంటర్వూ తీసుకున్న మెయిల్‌ టుడే.. టూర్‌లో ఆమెకు జరిగిన అవమానాన్ని వెలుగులోకి తెచ్చింది. టోర్నీలో పాల్గొనేందుకు రూ.5 లక్షలు లోన్‌ తీసుకున్నట్లు కాంచనమాల మెయిల్‌ టుడేకు వెల్లడించారు. టోర్నమెంట్‌ ముగిసేనాటికి తాను రూ.1,10,000/- హోటల్‌ బిల్లు చెల్లించాల్సివుందని చెప్పారు. తాను ఖర్చు చేసిన డబ్బు రీయింబర్స్‌మెంట్‌ రూపంలో వెనక్కు వస్తుందో? రాదో కూడా అధికారికంగా సమాచారం లేదని వెల్లడించారు. కాగా, ఈ ఏడాది జరిగిన పారా అథ్లెటిక్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌కు భారత్‌ నుంచి ఎంపికైన ఏకైక స్విమ్మర్‌ కాంచనమాల పాండేనే.

కాంచనమాలకు ఈ గతి పట్టడానికి కారణం భారత పారాలింపిక్‌ కమిటి(పీసీఐ)యే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టూర్‌కు బయల్దేరే ముందు ఆర్థిక సాయం కోసం కాంచనమాల పెట్టుకున్న అభ్యర్ధనను పీసీఐ పట్టించుకోలేదు. ఈ ఘటనపై టాప్‌ చైర్మన్‌ అభినవ్‌ బింద్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ క్రీడా శాఖ మంత్రి విజయ్‌ గోయల్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీలకు ట్వీట్‌ చేశారు. బింద్రా ట్వీట్‌కు వెంటనే సమాధానం ఇచ్చిన గోయల్‌.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు