మనోళ్లు రెండోది సాధిస్తారా...!

29 Jul, 2016 10:47 IST|Sakshi
మనోళ్లు రెండోది సాధిస్తారా...!

మైకేల్ ఫెల్ఫ్స్ 22 ఒలింపిక్ పతకాలు సాధించాడు.. ఒకే ఒలింపిక్స్‌లో ఏకంగా 8 స్వర్ణాలు తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇలా ఉంటుంది మెగా ఈవెంట్‌లో అగ్రరాజ్యాల క్రీడాకారుల హవా. అదే మన దేశం విషయానికొస్తే వ్యక్తిగత విభాగంలో ఏదో ఒక పతకం నెగ్గడమే గొప్ప అనే స్థితిలో ఉన్నాం. అయితే వ్యక్తిగత విభాగంలో రెండో పతకం సాధించిన సుశీల్ కుమార్ గత ఒలింపిక్స్ సందర్భంగా సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ ద్వారా కొంతమంది క్రీడాకారులకు సుశీల్ చేసిన ఫీట్‌ను అందుకునే అవకాశం ఉంది.
 
లియాండర్ పేస్.. (1996లో కాంస్యం)
ఎప్పుడో 1952లో కేదార్ జాదవ్ తర్వాత భారత్‌కు వ్యక్తిగత విభాగంలో పతకం అందించిన ఆటగాడు టెన్నిస్ వెటరన్ లియాండర్ పేస్. 1992 ఒలింపిక్స్‌లో తొలిసారి బరిలోకి దిగిన పేస్.. డబుల్స్ విభాగంలో రమేశ్ క్రిష్ణన్‌తో కలసి క్వార్టర్స్ వరకు చేరుకున్నాడు. ఆ తర్వాత 1996లో నాటకీయ పరిణామాల మధ్య సింగిల్స్ బరిలోకి దిగాల్సి వచ్చింది. అసలు ఆ టోర్నీలో పేస్ ప్రదర్శనే సంచలనం. వైల్డ్‌కార్డు ఎంట్రీ ద్వారా టోర్నీలో అడుగుపెట్టిన పేస్.. తొలి రెండు రౌండ్ల మ్యాచ్‌ల్లో మామూలు ఆటగాళ్లతోనే ఆడినా ఆ తర్వాత సీడెడ్లను మట్టికరిపించాడు.

మూడోరౌండ్‌లో మూడోసీడ్ ఆటగాడు థామస్ ఎంక్విస్ట్‌ను, క్వార్టర్స్‌లో 12వ సీడ్ రెంజో ఫుర్లాన్‌ను ఓడించి సెమీస్ చేరాడు. అక్కడ దిగ్గజ ఆటగాడు అండ్రీ అగస్సీ చేతిలో ఓడాడు. కాంస్య పతక పోరులో ఫెర్నాండో మెలిగెనిపై గెలిచి పతకం సాధించాడు. అయితే ఆ తర్వాత జరిగిన అన్నీ ఒలింపిక్స్‌లోనూ డబుల్స్ విభాగంలో (2000లో చివరిసారి సింగిల్స్‌లో ఆడాడు) బరిలోకి దిగినా ఆ స్థాయి ప్రదర్శన చేయలేదు.  2004లో డబుల్స్ విభాగంలో భూపతితో కలసి కాంస్య పతక పోరువరకు చేరినా.. అక్కడ ఓడాడు. ఈసారి రోహన్ బోపన్నతో పురుషుల డబుల్స్‌లో ఆడబోతున్న పేస్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. పేస్‌కివి ఏడో ఒలింపిక్స్.
 
అభినవ్ బింద్రా.. (2008లో స్వర్ణం)
భారత్‌కు వ్యక్తిగత విభాగంలో ఏకైక స్వర్ణం అందించిన క్రీడాకారుడు షూటర్ అభినవ్ బింద్రా. 2008 ఒలింపిక్స్‌లో 10 మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం నెగ్గిన బింద్రా.. ఈ సారి కూడా అదే విభాగంలో బరిలోకి దిగుతున్నాడు. 2004లో తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బింద్రాకు ఇవి నాలుగో ఒలింపిక్స్. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో కూడా భారత్ ఆశలన్నీ మోసుకెళ్లిన బింద్రా నిరాశ పరిచాడు.

10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో కనీసం ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. అయితే ఈసారి మాత్రం పతకం నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. పైగా 2014లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడంతోపాటు, అదే ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గి ఊపుమీదున్నాడు.
 
 గగన్ నారంగ్.. (2012లో కాంస్య పతకం)
2008లో జరిగిన ఒలింపిక్స్‌లో 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగి తీవ్రంగా నిరాశ పరిచాడు హైదరాబాద్ షూటర్ నారంగ్. దురదృష్టవశాత్తు ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. అయితే 2012లో మాత్రం అంచనాలను అందుకున్నాడు. మూడు విభాగాల్లో బరిలోకి దిగి 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్యం సాధించాడు.

50మీ. రైఫిల్ ప్రోన్, 50మీ. రైఫిల్ త్రీ పొజిషన్ విభాగాల్లో కూడా పోటీ పడినా పతకం నెగ్గలేదు. ఈసారి కూడా మూడు విభాగాల్లో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన గగన్ పతకం సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 2014 కామన్వెల్త్ క్రీడల్లో 50మీ. రైఫిల్ ప్రోన్ విభాగంలో రజతం, 50మీ. రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో కాంస్యం సాధించాడు. గగన్‌కు కూడా ఇది నాలుగో ఒలింపిక్స్.
 
 సైనా నెహ్వాల్.. (2012లో కాంస్యం)
ఈసారి ఒలింపిక్స్‌లో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న క్రీడాకారుల్లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఒకరు. 2008లో తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన సైనా సంచలన ప్రదర్శన చేసి క్వార్టర్స్‌కు చేరుకుంది. అక్కడ కూడా తొలిసెట్‌ను నెగ్గినా తర్వాత ఒత్తిడికి లోనై మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆ మ్యాచ్ నెగ్గితే సైనా పతకం సాధించేదేమో. అయితే 2012లో మాత్రం పట్టువదల్లేదు. చక్కటి ఆటతీరుతో సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఓడిపోయినా.. కాంస్య పతక పోరులో ప్రత్యర్థి తప్పుకోవడంతో పతకం సాధించి సంచలనం సృష్టించింది.

భారత్‌కు వ్యక్తిగత విభాగంలో పతకం అందించిన తొలి మహిళగా చరిత్రకెక్కింది. ఈసారి కూడా సైనాకు పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒలింపిక్స్‌లో సైనాకు పడిన ‘డ్రా’లను పరిశీలిస్తే సెమీస్‌కు చేరుకోవడం ఆమెకు చాలా సులవు. అక్కడ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఈసారి మెరుగైన పతకంతో తిరిగొచ్చే అవకాశాలున్నాయి.
 
యోగేశ్వర్ దత్.. (2012లో కాంస్యం)
భారత్ నుంచి ఎన్నడూ లేని విధంగా ఈసారి రెజ్లింగ్‌లో 8 మంది అర్హత సాధించారు. వారిలో భారీ అంచనాలున్నది యోగేశ్వర్ దత్‌పైనే. 2004 ఒలింపిక్స్‌లో 55 కేజీల విభాగంలో ఆరంభ దశల్లోనే ఓడిన యోగేశ్వర్.. 2008లో 60 కేజీల విభాగంలో క్వార్టర్స్‌కు చేరుకున్నా పతకం నెగ్గే ప్రదర్శన చేయలేదు. అయితే 2012లో మాత్రం సత్తాచాటాడు. గత రెండు ఒలింపిక్స్‌తో పోలిస్తే మెరుగైన ప్రదర్శన చేసి 60 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గాడు. ఈ సారి కూడా ఆరంభ రౌండ్ మ్యాచ్‌లో ఓడినా.. రెప్‌చేజ్‌లో అదరగొట్టాడు.

తన ప్రత్యర్థులందర్నీ ఓడించి పతకం సాధించాడు. యోగేశ్వర్ ఈసారి 65కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీపడబోతున్నాడు. 2014 ఆసియా క్రీడల్లో, 2014 కామన్వెల్త్ క్రీడల్లో 65 కేజీల విభాగంలోనే బంగారు పతకాలు సాధించిన యోగేశ్వర్ అదిరిపోయే ఫామ్‌లో ఉన్నాడు. గతంతో పోలిస్తే ఈ సారి మెరుగైన పతకం సాధించే అవకాశాలున్నాయి.
 

మరిన్ని వార్తలు