ఐపీఎల్‌ విజేతలు వీరే..

21 Mar, 2019 15:29 IST|Sakshi

గత  పదకొండు ఏళ్లలో ఎంతో మంది అనామక క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేస్తూ.. యువ ఆటగాళ్ల సత్తాకు ఓ వేదికగా మారింది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)‌. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనిక లీగ్‌ల్లో తొలిస్థానంలో నిలిచిన ఐపీఎల్‌.. పదకొండు వసంతాలు పూర్తి చేసుకుని పన్నెండో సీజన్‌లోకి అడుగుపెట్టింది. గడిచిన సీజన్‌లలో కొన్ని జట్లు మాత్రం పలుమార్లు ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ టోఫ్రిని ముద్దాడగా.. మరికొన్ని జట్లకు అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇప్పటివరకూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఐపీఎల్‌ సొంతం చేసుకుంది. దీనిలో భాగంగా గత విజేతలపై ఓ లుక్కేద్దాం.

ఐపీఎల్‌-2018
రిటర్న్‌ ఆఫ్‌ సూపర్‌ కింగ్స్‌... పునరాగమనం అంటే ఎంత ఘనంగా ఉండాలో చెన్నై నిరూపించింది. వివాదంతో లీగ్‌కు రెండేళ్లు దూరమై, వేలంలో మూడు పదుల ఆటగాళ్లతో అంకుల్స్‌ జట్టుగా ముద్ర పడి, సీజన్‌లో సొంతగడ్డపై ఒక్క మ్యాచ్‌కే పరిమితమై కూడా ఆ జట్టు అద్భుతాన్ని చేసింది. తమకే సాధ్యమైన రీతిలో విజయయాత్ర కొనసాగించి మూడోసారి ఐపీఎల్‌ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. నాయకుడిగా తనేమిటో మళ్లీ మళ్లీ చూపించిన ధోని మార్గనిర్దేశనంలో, మదరాసీల అభిమాన జనం ప్రోత్సాహంతో విజిల్‌ పొడు అంటూ గెలుపు ఈల వేసింది. చెన్నై 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలిచి టైటిల్‌ను మరోసారి సాధించింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్‌ విలియమ్సన్‌(735) అత్యధిక పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ అందుకోగా, కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్‌ ఆండ్రూ టై(24) అత్యధిక వికెట్లతో  పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు.

ఐపీఎల్‌-2017
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ మూడో సారి టైటిల్‌ నెగ్గి చరిత్ర సృష్టించింది. ఫైనల్లో రైజింగ్‌ పుణెతో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీ ఆసాంతం ఆల్‌రౌండ్‌ (316 పరుగులు, 12 వికెట్లు) ప్రదర్శన కనబర్చిన రైజింగ్‌ పుణె ఆటగాడు బెన్‌స్టోక్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ దిటోర్నీగా నిలిచాడు. సన్‌ రైజర్స్‌ ఆటగాళ్లు డెవిడ్‌ వార్నర్‌ (641) ఆరెంజ్‌ క్యాప్‌ అందుకోగా.. భువనేశ్వర్‌ కుమార్‌ 26 వికెట్లతో వరుసగా రెండో సారి పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు.

ఐపీఎల్‌-2016
ఫిక్సింగ్‌ వివాదంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీలపై రెండేళ్ల నిషేదం పడటంతో ఈ రెండు జట్లు ఈ సీజన్‌కు దూరమయ్యాయి. వాటి స్థానంలో కొత్తగా గుజరాత్‌ లయన్స్‌, రైజింగ్‌ పుణె జెయింట్స్‌లు వచ్చాయి. ఈ సీజన్‌ చాంపియన్‌గా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిలిచింది. ఫైనల్లో విరాట్‌ కోహ్లి సారథ్యంలోని పటిష్ట రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై 8 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్‌ సొంతం చేసుకుంది. ఈ టోర్నీ ఆసాంతం అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఫ్లేయర్‌ఆఫ్‌ ది టోర్నీతో పాటు ఆరెంజ్‌ క్యాప్‌ సొంతమైంది. ఈ సీజన్‌లో కోహ్లి ఏకంగా 973 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇది ఐపీఎల్‌ చరిత్రలోనే రికార్డు. బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్‌ కుమార్‌ 23 వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు.

ఐపీఎల్‌-2015
ఈ సీజన్‌ చాంఫియన్‌గా ముంబై ఇండియన్స్‌ నిలించింది. ఫైనల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై  41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి రెండో సారి టైటిల్‌ నెగ్గింది. కోల్‌కతా ఆటగాడు ఆండ్రూ రస్సెల్‌ బ్యాటింగ్‌ 326 పరుగులు,  బౌలింగ్‌14 వికెట్లతో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలవగా.. సన్‌రైజర్స్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ 562 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. బౌలింగ్‌లో 26 వికెట్లతో చెన్నై ఆటగాడు డ్వాన్‌ బ్రావో పర్పుల్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు.  ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికే పరిమితమైంది.

 ఐపీఎల్‌-2014
పుణెవారియర్స్‌ ఫ్రాంచైజీ తప్పుకోవడంతో 8 జట్లతో కొనసాగిన ఈ సీజన్‌ టైటిల్‌ను గంభీర్‌ నాయకత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రెండో సారి కైవసం చేసుకుంది. ఫైనల్లో బెయిలీ సారథ్యంలోని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై కోల్‌కతా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో పంజాబ్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ 552 పరుగులతో మ్యాన్‌ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. కోల్‌కతా ఆటగాడు రాబిన్‌ ఉతప్ప 660 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ అందుకోగా చెన్నై ఆటగాడు మోహిత్‌ శర్మ 23 వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు. ఈ సీజన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో ఆరోస్థానంతో సరిపెట్టుకుంది.

 ఐపీఎల్‌-2013
ఈ సీజన్‌లో డెక్కన్‌ చార్జర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం మారడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌గా బరిలోకి దిగింది.  ఐపీఎల్‌ ఐదో సీజన్‌ చాంపియన్‌గా రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ నిలిచింది. వరుసగా నాలుగో సారి ఫైనల్‌ చేరిన చెన్నై సూపర్‌కింగ్స్‌పై ముంబై ఇండియన్స్‌ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.  రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు షేన్‌ వాట్సన్‌ బ్యాటింగ్‌లో 543 పరుగులతో, బౌలింగ్‌లో 13 వికెట్లతో రాణించడంతో మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. చెన్నై ఆటగాడు మైక్‌హస్సీ 733 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ అందుకోగా.. చెన్నైకే చెందిన మరో ఆటగాడు డ్వాన్‌ బ్రావో 32 వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. పేరు మార్చుకొని బరిలోకి దిగిన హైదరాబాద్‌ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి క్వాలిఫైయర్స్‌కు అర్హత సాధించింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడింది.

 ఐపీఎల్‌-2012
గత సీజన్‌లో వచ్చి చేరిన రెండు కొత్త జట్లలో కేరళ కొచ్చి టస్కర్‌ ఫ్రాంచైజీ ఆర్థిక కారణాలతో ఈ సీజన్‌ నుంచి తప్పుకుంది. దీంతో 9 జట్లతో కొనసాగిన ఈ సీజన్‌ టైటిల్‌ను గౌతమ్‌ గంభీర్‌ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సొంతం చేసుకుంది. వరుసగా మూడో సారి ఫైనల్‌కు వచ్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ను కోల్‌కతా 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఇక ఈ సీజన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన కోల్‌కతా స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ 24 వికెట్లతో మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. ఈ సీజన్‌లో సైతం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు క్రిస్‌ గేల్‌ తన పరుగుల వరదను కొనసాగించాడు.  గేల్‌ 733 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ను సొంత చేసుకోగా 25 వికెట్లతో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఆటగాడు  మోర్నీ మోర్కెల్‌ పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు. ఈ సీజన్‌ పాయింట్ల పట్టికలో డెక్కన్‌ చార్జర్స్‌ హైదరాబాద్‌ 8వ స్థానంలో నిలిచింది.

ఐపీఎల్‌-2011
ఐపీఎల్‌కు ఆదరణ పెరగడంతో ఈసీజన్‌లో మరో రెండు కొత్త జట్లు పుణె వారియర్స్‌,  కేరళ కొచ్చి టస్కర్స్‌లు వచ్చాయి. ఈ సీజన్‌ టైటిల్‌ను సైతం చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. ఫైనల్లో డానియల్‌ వెటోరి సారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) పై ధోని సేన 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఆటగాడు క్రిస్‌గేల్‌ పరుగుల సునామీ సృష్టించాడు. ఏకంగా 608 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌తో పాటు బౌలింగ్‌లో 8 వికెట్లు పడగొట్టి మ్యాన్‌ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. ముంబై ఇండియన్స్‌ ఆటగాడు లసిత్‌ మలింగా 28 వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో డెక్కన్‌ చార్జర్స్‌ హైదరాబాద్‌ జట్టు పాయింట్ల పట్టికలో 7వ స్థానంతో సరిపెట్టుకుంది.

 ఐపీఎల్‌-2010
 మూడో సీజన్‌ టైటిల్‌ను మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంతం చేసుకోగా.. సచిన్‌ టెండూల్కర్‌ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌ రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో ముంబై కెప్టెన్‌ సచిన్‌ టెండూల్కర్‌ 618 పరుగులతో మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీతో పాటు ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. ఇక పర్పుల్‌ క్యాప్‌ను 21 వికెట్లతో డెక్కన్‌ చార్జర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు ప్రజ్ఞాన్‌ ఓజా అందుకున్నాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ జట్టు సెమీస్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తో తలపడి 38 పరుగుల తేడాతో ఓడింది.

 ఐపీఎల్‌ -2009
రెండో సీజన్‌ చాంపియన్‌గా ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ సారథ్యంలోని డెక్కన్‌ చార్జర్స్‌ హైదరాబాద్‌ నిలవగా..  అనిల్‌ కుంబ్లే కెప్టెన్సీలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్‌ మ్యాచ్‌లో బెంగళూరుపై  6 పరుగుల తేడాతో గెలిచిన హైదరాబాద్‌ జట్టు టైటిల్‌ కైవసం చేసుకుంది. ఈ సీజన్‌ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న హైదరాబాద్‌ కెప్టెన్‌ గిల్‌క్రిస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. బ్యాటింగ్‌లో 495 పరుగులు, కీపర్‌గా 18 డిసిమిసల్స్‌ సాధించాడు.  చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు మాథ్యూ హెడెన్ 572 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ అందుకోగా.. డెక్కన్‌ చార్జర్స్‌  హైదరాబాద్‌ బౌలర్‌ ఆర్పీ సింగ్‌ 23 వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు.

ఐపీఎల్‌ -2008
ఐపీఎల్‌ తొలి సీజన్‌ టైటిల్‌ను షేన్‌వార్న్‌ సారథ్యంలోని రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు గెలవగా ధోని కెప్టెన్సీలోని చెన్నైసూపర్‌ కింగ్స్‌ రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌ ప్లేయర్‌ షేన్‌ వాట్సన్‌ బ్యాటింగ్‌లో 472 పరుగులతో బౌలింగ్‌లో 17 వికెట్లతో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. ఇక కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌ ఆటగాడు షాన్‌ మార్ష్‌ 616 పరుగులతో ఆరేంజ్‌ క్యాప్‌ అందుకోగా.. రాజస్థాన్‌ ప్లేయర్‌ సోహైల్‌ తన్వీర్‌ 22 వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు.  ఈ సీజన్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌ సారథ్యంలోని హైదరాబాదీ జట్టు డెక్కన్‌ చార్జర్స్‌14 మ్యాచ్‌లకు కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు