హీనా సంచలనం

12 Nov, 2013 00:29 IST|Sakshi
హీనా సంచలనం

 ముంబై: భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచ కప్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ పిస్టల్ షూటర్‌గా ఆమె గుర్తింపు పొందింది. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న ఈ సీజన్ ముగింపు టోర్నమెంట్‌లో హీనా సిద్ధూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
 
 గతంలో భారత్ నుంచి అంజలి భగవత్ (2002లో), గగన్ నారంగ్ (2008లో) రైఫిల్ ఈవెంట్‌లో ఈ ఘనత సాధించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-10 షూటర్లు మాత్రమే పాల్గొనే ఈ టోర్నీలో హీనా విశేషంగా రాణించింది. స్వర్ణ పతకాన్ని నెగ్గే క్రమంలో ఈ పంజాబ్ అమ్మాయి ‘డబుల్ ఒలింపిక్ చాంపియన్’ గువో వెన్‌జున్ (చైనా)... ప్రపంచ చాంపియన్ అరునోవిచ్ జొరానా (సెర్బియా)... రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన ఒలెనా కొస్టెవిచ్ (ఉక్రెయిన్)లను ఓడించింది. క్వాలిఫయింగ్‌లో 384 పాయింట్లు స్కోరు చేసిన హీనా... ఫైనల్లో 203.8 పాయింట్లు సాధించింది. జొరానా (సెర్బియా) 198.6 పాయింట్లతో రజతం... విక్టోరియా (బెలారస్) 176.8 పాయింట్లతో కాంస్యం గెలిచారు.
 
 ఈ ఏడాది ఆరంభంలో షూటర్ రోనక్ పండిత్ (మహారాష్ట్ర)ను వివాహం చేసుకున్న 24 ఏళ్ల హీనా తన శిక్షణ కేంద్రాన్ని పాటియాలా నుంచి ముంబైకు మార్చుకుంది. భర్త పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్న హీనా మ్యూనిచ్‌లో అందరి అంచనాలను తారుమారు చేసి విజేతగా నిలిచింది. అంతర్జాతీయస్థాయిలో హీనాకిదే తొలి పతకం కావడం విశేషం. గత మే నెలలో ఆమె కొరియా, జర్మనీలలో జరిగిన రెండు ప్రపంచ కప్ టోర్నమెంట్లలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. వాస్తవానికి హీనా ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధించలేదు. అయితే ఈ మెగా ఈవెంట్‌కు అర్హత పొందిన ముగ్గురు విదేశీ క్రీడాకారిణులు వ్యక్తిగత కారణాలతో వైదొలిగారు. దాంతో ఫైనల్స్‌లో పాల్గొనాలని హీనాకు నిర్వాహకుల నుంచి పిలుపు వచ్చింది. దాంతో ఆమె పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకుండానే ఈ టోర్నీలో బరిలోకి దిగి అనూహ్యంగా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది.
 
 ‘పతకం నెగ్గడం నాకే ఆశ్చర్యమనిపిస్తోంది. అసలు ఈ టోర్నీలో పాల్గొంటానని అనుకోలేదు. అర్హత సాధించిన ముగ్గురు షూటర్లు చివరి నిమిషంలో వైదొలగడంతో నాకు అవకాశం లభించింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో వీసా ఏర్పాట్లు పూర్తిచేసుకొని విమానం టిక్కెట్లు సంపాదించి మ్యూనిచ్‌కు వచ్చాను. చాలా కాలం నుంచి అంతర్జాతీయస్థాయిలో పతకం లేకుండానే శిక్షణ కొనసాగిస్తున్నాను. ఈ రోజు నాకు అంతా కలిసొచ్చింది.’     
 - హీనా సిద్ధూ
 

మరిన్ని వార్తలు