భారత షూటర్ల జోరు

21 Sep, 2016 00:42 IST|Sakshi
భారత షూటర్ల జోరు

 గబాలా (అజర్‌బైజాన్): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత షూటర్ల నిలకడైన ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పోటీల్లో భారత్‌కు ఐదు పతకాలు లభించాయి. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత షూటర్ రుషిరాజ్ బారోట్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. 19 ఏళ్ల రుషిరాజ్ 556 పాయింట్లు సాధించి ఐదో స్థానంతో ఫైనల్‌కు అర్హత పొందాడు. ఫైనల్లో రుషిరాజ్ 25 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా... లుకాస్ స్కుర్మల్ (చెక్ రిపబ్లిక్-23 పాయింట్లు) రజత పతకాన్ని, సెర్గీ ఎవ్‌గ్లెవ్‌స్కీ (ఆస్ట్రేలియా-20 పాయింట్లు) కాంస్య పతకాన్ని సంపాదించారు.
 
  అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ప్రతీక్, అర్జున్ బబూటా, ప్రశాంత్‌లతో కూడిన భారత బృందానికి పసిడి పతకం లభించింది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో అర్జున్‌కు కాంస్యం దక్కింది. 50 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో అన్‌మోల్, నిశాంత్ భరద్వాజ్, అర్జున్ దాస్‌లతో కూడిన భారత జట్టు రజతం సాధించింది. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో దిల్‌రీన్ గిల్, గీతాలక్ష్మి దీక్షిత్, ఆశి రస్తోగిలతో కూడిన భారత జట్టు కాంస్యం కై వసం చేసుకుంది.
 

మరిన్ని వార్తలు