వియత్నాం ఓపెన్‌ విజేత సౌరభ్‌ వర్మ

16 Sep, 2019 04:02 IST|Sakshi

ఫైనల్లో చైనా ప్లేయర్‌పై గెలుపు

ఈ ఏడాది మూడో టైటిల్‌ సొంతం

హో చి మిన్‌ సిటీ: అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్న భారత షట్లర్‌ సౌరభ్‌ వర్మ ఈ ఏడాది తన ఖాతాలో మూడో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. వియత్నాం ఓపెన్‌ వరల్డ్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో తొలి రౌండ్‌ నుంచి సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఫైనల్‌ చేరిన సౌరభ్‌ వర్మ... తుది పోరులో కీలక దశలో పైచేయి సాధించి టైటిల్‌ను కొల్లగొట్టేశాడు. 72 నిమిషాల మారథాన్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సౌరభ్‌ 21–12, 17–21, 21–14తో సున్‌ ఫె జియాంగ్‌ (చైనా)పై నెగ్గాడు.   

మధ్యలో తడబడినా...  
పూర్తి ఆత్మవిశ్వాసంతో మ్యాచ్‌ను ఆరంభించిన సౌరభ్‌ వర్మ ప్రత్యర్థి పేలవమైన రిటర్న్‌ షాట్లను ఆసరాగా చేసుకొని చెలరేగాడు. తొలి గేమ్‌లో మొదటి నాలుగు పాయింట్లు సాధించి 4–0 ఆధిక్యంలోకెళ్లాడు. మళ్లీ అదే దూకుడును కొనసాగించి 11–4తో విరామానికి వెళ్లాడు. అనంతరం మరోసారి వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 15–4తో గేమ్‌ విజయానికి చేరువయ్యాడు. ఈ దశలో కాస్త ప్రతిఘటించిన సున్‌ కొన్ని పాయింట్లు సాధించినా అంతరం భారీగా ఉండటంతో తొలి గేమ్‌ను 21–12తో సౌరభ్‌ సొంతం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న సున్‌ వరుస పాయింట్లు సాధిస్తూ సౌరభ్‌కు అందకుండా వెళ్లాడు. తొలుత 8–0తో అనంతరం 11–5తో ఆధిపత్యం ప్రదర్శించిన సున్‌ రెండో గేమ్‌ను చేజిక్కించుకోవడంతో మ్యాచ్‌ నిర్ణాయక మూడో గేమ్‌కు దారితీసింది. మూడో గేమ్‌లో 4–2తో వెనుకబడ్డ సౌరభ్‌ సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్‌ షాట్లతో చెలరేగి 17–14తో ముందంజ వేశాడు. తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు